గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక భేటీ అయ్యారు. మంత్రివర్గ మార్పు, అలాగే కొత్త జిల్లాలు కొలువు తీరిన నేపథ్యంలో గవర్నర్‌ను జగన్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ సాయంత్రం రాజ్‌భవన్‌కు సీఎం జగన్ వెళ్లారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులు జగన్‌కు స్వాగతం పలికారు.
ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్న జగన్, కాసేపటి క్రితం గవర్నర్‌ను కలవడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కొత్త కేబినెట్‌లో ఎవరెవరుంటారు, అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు, ఢిల్లీలో ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులతో కలయిక, అక్కడి విశేషాలను గవర్నర్‌తో సీఎం పంచుకోనున్నారని తెలిసింది.
ఈ నెల 11న మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణకు గవర్నర్‌ను ఆహ్వానించనున్నారని సమాచారం. కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాల్సిందిగా గవర్నర్‌ను జగన్ కోరుతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అదే రోజున నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం వైఎస్ జగన్ గవర్నర్‌ను కోరనున్నారు. గవర్నర్‌తో సీఎం జగన్ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇటీవల గవర్నర్, సీఎం మధ్య కోల్డ్ వార్ సాగుతున్న సంగతి తెలిసిందే.