గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌ల‌పై క‌స్సుమ‌న్న మంత్రి

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్య రోజురోజుకూ గ్యాప్ పెరుగుతోంది. గ‌వ‌ర్న‌ర్ ఒక మాటంటే, అందుకు ప్ర‌భుత్వం వైపు నుంచి కూడా అదే స్థాయిలో ప్ర‌తిస్పంద‌న వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ ఢిల్లీ…

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్య రోజురోజుకూ గ్యాప్ పెరుగుతోంది. గ‌వ‌ర్న‌ర్ ఒక మాటంటే, అందుకు ప్ర‌భుత్వం వైపు నుంచి కూడా అదే స్థాయిలో ప్ర‌తిస్పంద‌న వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ ఢిల్లీ ప‌ర్యట‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది. ప్ర‌ధాని మోదీకి కేసీఆర్ స‌ర్కార్‌పై గ‌వ‌ర్న‌ర్ ఫిర్యాదు చేశార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇటీవ‌ల ప‌లు సంద‌ర్భాల్లో కేసీఆర్ స‌ర్కార్‌పై గ‌వ‌ర్న‌ర్ కామెంట్స్‌పై మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి ఘాటుగా స్పందించారు.

రాజ్‌భవన్‌లోకి గవర్నర్‌ రాజకీయాలు తెచ్చారని మంత్రి జగదీష్‌రెడ్డి మండిప‌డ్డారు. తమిళిసై బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆమె వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. గవర్నర్‌ వ్యవస్థను ఉపయోగించుకుని, బీజేపీ రాజకీయాలు చేస్తోందని ధ్వ‌జ‌మెత్తారు. గవర్నర్‌గా వస్తే గౌరవించడంలో త‌మ‌కు ఎలాంటి‌ అభ్యంతరం లేదన్నారు. రాజకీయ పార్టీ నేతగా వస్తే గౌరవించాల్సిన అవసరం లేద‌ని తెగేసి చెప్పారు. ప్రోటోకాల్ పాటించడం లేదనేది పూర్తిగా అవాస్తవమ‌న్నారు.  

పెద్దల‌ను ఎలా గౌరవించాలో ముఖ్యమంత్రి త‌మ‌కు నేర్పుతార‌న్నారు. గవర్నర్ వస్తున్నారంటే ముఖ్యమంత్రి స్వాగతం పలికి‌ గౌరవం ఇస్తారన్నారు. కానీ గవర్నర్ అలా ఎందుకు స్పందించారో తెలియదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏ సందర్భంలో రాజ్యాంగాన్ని, వ్యవస్థలను గౌరవించలేదో చెప్పాలని మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. 

తెలంగాణ ప్ర‌భుత్వం రాజ్యాంగాన్ని, వ్య‌వ‌స్థ‌ల్ని గౌర‌వించాల‌ని ఇవాళ గ‌వ‌ర్న‌ర్ హిత‌వు ప‌లికిన నేప‌థ్యంలో మంత్రి గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు గ్యాప్ ఉందని తామెప్పుడూ చెప్పలేదన్నారు. కానీ గవర్నరే పదే పదే మీడియా ముందుకొచ్చి ఆ ర‌క‌మైన కామెంట్స్ చేస్తున్నార‌ని ఆగ్ర‌హించారు.  

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సేవారంగానికి చెందిన వ్య‌క్తి కాద‌ని గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌ల‌పై మంత్రి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. రాజకీయరంగం కూడా సేవారంగమే అని మంత్రి చెప్పుకొచ్చారు. ఒకవేళ కౌశిక్ రెడ్డికి అది వర్తిస్తే గవర్నర్ వ్యవస్థకు అదే సూత్రం వ‌ర్తిస్తుంద‌ని దీటైన స‌మాధానం ఇచ్చారు.