ప్రభుత్వానికి వివరణ ఇవ్వడంలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి లెక్కలేనితనాన్ని ప్రదర్శించారు. వివరణ చూస్తూ… మీడియాతో మాట్లాడితే ఏంటట? అని ప్రశ్నిస్తున్నట్టుగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెగాసస్ వ్యవహారంపై ఏబీవీ మీడియాతో మాట్లాడ్డాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు ఆయనకు సీఎస్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. వారంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
కానీ ఏబీ వెంకటేశ్వరరావు అంత సమయం తీసుకోలేదు. వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలపై స్పందించవచ్చని సీఎస్ నోటీసుకు ఘాటుగానే స్పందించారు. అంతేకాదు, అలాంటి వాటిపై స్పందించే అవకాశం ఆలిండియా సర్వీస్ రూల్స్ కల్పించాయని ఆయన ప్రభుత్వానికి పాఠాలు చెప్పుకొచ్చారు. రూల్-17కి అనుగుణంగానే మీడియాతో మాట్లాడినట్టు వివరించారు.
ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు పెగాసస్‌ను ఉపయోగించలేదని మాత్రమే మీడియా సమావేశంలో వివరించానన్నారు. ఆలిండియా సర్వీస్ రూల్-6 ప్రకారం అధికారిక అంశాలపై వివరణ ఇవ్వొచ్చని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు పారదర్శకత, జవాబుదారీతనంతో ఉండాలని, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకూడదని మాత్రమే ఉండాలని రూల్స్ చెబుతున్నాయని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.
తానెక్కడా ప్రభుత్వాన్ని విమర్శించలేదన్నారు. తన గౌరవానికి భంగం కలిగించేలా ఆరోపణలు చేస్తే స్పందించకూడదా? అని ఏబీవీ ప్రశ్నించడం గమనార్హం. మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్న విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసినట్టు ఆయన వివరించారు.
ప్రభుత్వానికి ఏబీ వివరణలో ధిక్కరణను స్పష్టంగా చూడొచ్చు. ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని సీఎం షోకాజ్ నోటీసు ఇస్తే, దానికి సమాధానంగా సమాచారం ఇచ్చానని ఏబీ అనడం ధిక్కరణే అని చెబుతున్నారు. అనుమతికి, సమాచారానికి చాలా తేడా ఉంటుంది. సమాచారం అనేది ఎప్పటికీ అనుమతి కాదు. అలాగే తనను దూషిస్తే స్పందించకూడదా అని ఏబీ ఎదురు ప్రశ్నించడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకునే అవకాశాలున్నాయి.