తెలంగాణ ప్రభుత్వంతో ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసైకు వివాదం నెలకున్న నేపథ్యంలో, ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఒకవైపు కేసీఆర్ సర్కార్‌తో పేచీ లేదంటూనే, తానెవరికీ భయపడనని పదేపదే తమిళసై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీతో గవర్నర్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేసీఆర్ సర్కార్‌తో విభేదాలకు గల కారణాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.
ప్రధానితో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని, వ్యవస్థల్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని ఆమె కోరారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంలో ఎలాంటి వివాదం లేదన్నారు.
ప్రభుత్వం ఒక పేరుని సేవారంగం నుంచి పంపినట్టు పరోక్షంగా కౌశిక్‌రెడ్డి గురించి గవర్నర్ ప్రస్తావించారు. అయితే సదరు వ్యక్తి ఎలాంటి సేవా చేయలేదని తాను భావించానని చెప్పుకొచ్చారు. ఇదే అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్పినట్టు గవర్నర్ తెలిపారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి ప్రొటోకాల్ తెలియదా? అని ఆమె ప్రశ్నించారు. సమ్మక్క – సారలమ్మ జాతర నిమిత్తం మేడారం వెళ్లిన గవర్నర్‌కు మంత్రులు, కలెక్టర్, ఇతర అధికారులు స్వాగతం పలకకపోవడంపై తమిళిసై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌కు మంత్రులెప్పుడైనా రావచ్చన్నారు.
తననెవరూ అవమానించలేదని, తనెకలాంటి ఇగోలు లేవని ఆమె స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసేందుకు ఢిల్లీకి రాలేదని గవర్నర్ స్పష్టం చేశారు.