తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వివిధ పార్టీల్లో కూడికలు, తీసివేతలు మొదలయ్యాయి. అనూహ్యంగా కాంగ్రెస్‌లోకి చేరికలు పెరిగాయి. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ ప్రభావం తెలంగాణపై పడింది. తెలంగాణలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పొంగులేటి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ఆ సీటును ఆశిస్తున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి ఎలా స్పందిస్తారనే చర్చకు తెరలేచింది. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి రాకను స్వాగతిస్తున్నట్టు ఆమె తెలిపారు. పొంగులేటి రాకను వ్యతిరేకిస్తున్నారనే ప్రచారాన్ని కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ కొట్టి పారేశారు.
పొంగులేటి కాంగ్రెస్‌లోకి వస్తే తాను వ్యతిరేకిస్తున్నట్టు ఎవరు చెప్పారని ఆమె ప్రశ్నించారు. అసలు పొంగులేటి రాక విషయమై తాను ఎక్కడా మాట్లాడలేదన్నారు. పోటీపై నాయకులు అనుకుంటే సరిపోదని, అంతిమంగా అధిష్టానం నిర్ణయం తీసుకుం టుందని ఆమె స్పష్టం చేశారు. తాను పార్లమెంట్‌కు లేదా అసెంబ్లీకి పోటీ చేస్తానో ఎవరికి తెలుసని ఆమె ప్రశ్నించడం గమనార్హం. పార్లమెంట్, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగవచ్చని రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు.
బీఆర్ఎస్, బీజేపీ రెండూ వేర్వేరు పార్టీలు కాదని, అవి రెండు ఒకటే అని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ ప్యాకెట్ మనీ ఇస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్స్‌పై రేణుకా చౌదరి తనదైన స్టైల్‌లో వెటకరించారు. బండి సంజయ్ ఎవరి దగ్గర ప్యాకెట్ మనీ తీసుకుంటున్నారో తెలియదా అని ఆమె దెప్పి పొడిచారు.
కోవర్టులనేవి రాజకీయాల్లో సర్వసాధారణమని, కాంగ్రెస్‌లోనూ ఉన్నారని ఆమె అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోందని ఆమె అన్నారు.