పార్టీలో చేరిన వెంట‌నే.. ఆమెకు కీల‌క ప‌ద‌వి!

కాంగ్రెస్‌లో చేరి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌కనే లేడీ అమితాబ్ విజ‌య‌శాంతికి కీల‌క ప‌ద‌వి ద‌క్కింది. కాంగ్రెస్ ప్ర‌చార‌, ప్లానింగ్ క‌మిటీ చీఫ్ కోఆర్డినేట‌ర్‌గా ఆమెను నియ‌మించ‌డం విశేషం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం…

కాంగ్రెస్‌లో చేరి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌కనే లేడీ అమితాబ్ విజ‌య‌శాంతికి కీల‌క ప‌ద‌వి ద‌క్కింది. కాంగ్రెస్ ప్ర‌చార‌, ప్లానింగ్ క‌మిటీ చీఫ్ కోఆర్డినేట‌ర్‌గా ఆమెను నియ‌మించ‌డం విశేషం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌ని కాంగ్రెస్ అధిష్టానం ప‌ట్టుద‌ల‌తో వుంది. బీజేపీ, బీఆర్ఎస్‌ల‌లో అసంతృప్త నేత‌లంద‌రినీ త‌న వైపు తిప్పుకోడానికి కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తోంది.

ఈ క్ర‌మంలో బీజేపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న విజ‌య‌శాంతిని త‌న వైపు కాంగ్రెస్ పార్టీ లాక్కుంది. బీఆర్ఎస్‌ను ఎదుర్కోగ‌ల స‌త్తా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి వుంద‌నే న‌మ్మ‌కంతో కాంగ్రెస్ నుంచి ఆ పార్టీలో విజ‌య‌శాంతి చేరారు. అయితే బీఆర్ఎస్‌కు అనుకూలంగా బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని బీజేపీ నేత‌లు న‌మ్ముతున్నారు. అందుకే ఆ పార్టీలో చేరిన నేత‌లంతా తిరిగి కాంగ్రెస్ గూటికి చేర‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఇందులో భాగంగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, వివేక్ వెంక‌ట‌స్వామి, తాజాగా విజ‌య‌శాంతి కాంగ్రెస్‌లో చేర‌డం చ‌ర్చ‌నీయాం శ‌మైంది. బీజేపీ నుంచి తిరిగి వ‌చ్చిన వారిలో కోమ‌టిరెడ్డి, వివేక్‌ల‌కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది. నామినేష‌న్ల గ‌డువు ముగిసిన త‌ర్వాత చేరిన విజ‌య‌శాంతికి ప్ర‌చార సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం విశేషం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రాష్ట్ర ప్ర‌చార‌, ప్లానింగ్ క‌మిటీ సార‌థ్య బాధ్య‌త‌ల్ని విజ‌య‌శాంతికి అప్ప‌గించ‌డంతో పాటు 15 మంది స‌భ్యుల‌ను కూడా నియ‌మించారు.  

ఈ క‌మిటీ స‌భ్యులుగా స‌మ‌ర‌సింహారెడ్డి, పుష్ప‌లీల‌, మ‌ల్లు ర‌వి, కోదండ‌రెడ్డి, న‌రేంద‌ర్‌రెడ్డి  యరపతి అనిల్‌, రాములు నాయక్‌, పిట్ల నాగేశ్వరరావు, దీపక్‌ జాన్ తదిత‌రుల‌ను నియ‌మించారు.