రాజకీయాల్ని ఎలా చేయాలో అలా చేయకపోతే జనానికి రకరకాల అనుమానాలు వస్తుంటాయి. అనుమానం వస్తున్నదంటే, అందుకు ఆ వ్యక్తి లేదా, రాజకీయ పార్టీని నడిపే అధినాయకుడి వ్యవహార శైలే కారణం. నిప్పులేనిదే పొగ రాదని పెద్దలు ఊరికే అంటారా? పవన్‌కల్యాణ్ విషయంలో అదే జరుగుతోంది. పవన్ ఆలోచనలే ఆయన పార్టీ. పవన్‌తో సమస్య ఏంటంటే ఆయన పెద్ద పెద్ద మాటలు చెబుతుంటారు. తీరా ఆచరణ విషయానికి వస్తే తుస్సుమనిపిస్తారు.
జనసేన పార్టీ తనకంటూ ఆరేడు సిద్ధాంతాలను పెట్టుకుంది. అవి ఏంటంటే… కులాలను కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం, అవినీతిపై రాజీలేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం.
వీటి గురించి చదువుతుంటే, వింటుంటే ఎంతో ముచ్చటేస్తుంది. ఇలాంటివి కదా ఏ రాజకీయ పార్టీకైనా ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలనే భావన కలుగుతుంది. అయితే పవన్‌కల్యాణ్ తన సిద్ధాంతాలను తానే చంపేసేలా నడుచుకుంటున్నారనే విమర్శ బలంగా వుంది. అందుకే ఆయన ప్రజాదరణ పొందలేకపోతున్నారు. వారాహి యాత్ర పేరుతో జనంలోకి వెళ్లిన పవన్‌కల్యాణ్… నిత్యం కులం పేరుతో విభజన రాజకీయాలకు తెరలేపారు.
ఈ నేపథ్యంలో జనసేనాని పవన్‌కల్యాణ్‌పై సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి. పార్టీ నడపాలంటే చాలా డబ్బులు కావాలన్న పవన్‌కల్యాణ్ కామెంట్స్‌పై నెటిజన్లు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. అదేంటంటే…
“అవును మీరు చెప్పింది నిజమే. అయినా మీకు నారారాజపోషకులు ఉన్నారు కదా ?!.. సర్, ఒక డౌటనుమానం! పార్టీ కోసం డబ్బులా? డబ్బుల కోసం పార్టీనా?” జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్‌కు నెటిజన్లు కుమ్మేస్తున్నారు.
కేవలం డబ్బుల కోసమే వైసీపీ వ్యతిరేక రాజకీయాలను పవన్ చేస్తున్నారంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. జనసేనను బలోపేతం చేసుకోకుండా, టీడీపీకి తాకట్టు పెట్టారని, తన అభిమానుల్ని, సామాజికవర్గాన్నంతటిని గంపగుత్తగా చంద్రబాబుకు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యారని నెటిజన్లు విమర్శలతో చితక్కొడుతున్నారు. టీడీపీతో పవన్ బేరం సీట్ల కోసం కాదని, అదేంటో జనానికి బాగా తెలుసని నెటిజన్లు సృజనాత్మక పోస్టులు పెట్టడం గమనార్హం.