ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దెబ్బకు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ దఫా ఎన్నికల్లో ఆయన పోటీ చేసే పరిస్థితి లేదు. 2014లో వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీలోకి జంప్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. అసెంబ్లీ వేదికగా, అలాగే వెలుపల జగన్‌పై అవాకులు చెవాకులు పేలారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏం చేస్తారోననే భయంతో బీజేపీ పంచన ఆదినారాయణరెడ్డి చేరారు. అయితే బీజేపీని బలోపేతం చేయడం పక్కన పెట్టి టీడీపీ వాయిస్‌ను వినిపిస్తున్నారు. ఇదే సందర్భంలో జమ్మలమడుగులో అదినారాయణరెడ్డి అన్న కుమారుడు భూపేష్‌రెడ్డిని టీడీపీ ఇన్‌చార్జ్‌గా నియమించింది. రానున్న రోజుల్లో భూపేష్ ఎన్నికల బరిలో ఉండనున్నారు.
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని బలమైన కోరిక వుంది. టీడీపీతో బీజేపీ పొత్తు వుంటే ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వుండేది. కానీ టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పొలిటికల్ కెరీర్ ముగిసిపోవడానికి ఎంతో దూరం లేదు. కానీ ఆదినారాయణరెడ్డి మాత్రం తన భవిష్యత్ గురించి ఆలోచించకుండా, ఏవేవో పగటి కలలు కంటూ టీడీపీ శ్రేణుల్ని సంతృప్తిపరచాలని ఉవ్విళ్లూరుతున్నారు.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని, ఏపీ బాధ్యతలు అప్పగిస్తే… జగన్ పని అయిపోయినట్టే అని ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. ఇలా జగన్‌పై విమర్శలు చేస్తూ ఆచరణకు నోచుకోనివి ఊహించుకుంటున్నారు. ఈ దఫా జమ్మలమడుగులో తాను పోటీ చేయకపోతే తాను ఏమవుతారో చెబితే జనాలు వింటారు. రాజకీయంగా ఎటూ తేల్చుకోలేక నోటికొచ్చినట్టు కాలం గడిపేవాళ్లు ఎక్కువై పోయారు. అలాంటి వారిలో ఆదినారాయణరెడ్డి ఒకరు.