అసంతృప్తిలో ఉత్తరాంధ్రా మంత్రి…?

ఆయన సీనియర్ నేత. వైఎస్సార్ ఫ్యామిలీకి నమ్మిన బంటు. జగన్ పట్ల వీర విధేయత చూపిన నాయకుడు. ఈ మధ్యనే జగన్ సర్కార్ మళ్లీ అధికారంలోకి రాకపోతే నా ఆస్తిని రాసిచ్చేసి రాజకీయ సన్యాసం…

ఆయన సీనియర్ నేత. వైఎస్సార్ ఫ్యామిలీకి నమ్మిన బంటు. జగన్ పట్ల వీర విధేయత చూపిన నాయకుడు. ఈ మధ్యనే జగన్ సర్కార్ మళ్లీ అధికారంలోకి రాకపోతే నా ఆస్తిని రాసిచ్చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని సవాల్ మీద సవాల్ చేసిన నాయకుడు. ఆయనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్.

ఆయన ఇంతలా జగన్ని మెచ్చుకున్నా మంత్రి పదవి అయితే ఉండే సీన్ కనిపించడంలేదు అంటున్నారు. అందరితో పాటు ఆయన కూడా రాజీనామా చేయాల్సిందే అని అంటున్నారు. దాంతో ధర్మాన క్రిష్ణ దాస్ లో అసంతృప్తి కనిపిస్తోందా అన్నదే చర్చగా ఉంది. తాజాగా ఆయన తన సొంత నియోజకవర్గం నరసన్నపేటలో మాట్లాడుతూ, తాను త్వరలోనే మంత్రి పదవి నుంచి దిగిపోతున్నాను అని ఉన్న విషయాన్ని బయటకు  చెప్పేశారు.

అంతే కాదు, తన తమ్ముడు ప్రసాదరావు మంత్రి అవుతున్నాడు అని హింట్ కూడా ఇచ్చారు. అక్కడితో ఆగలేదు, తాను వైఎస్సార్ ఫ్యామిలీకి, జగన్ కి ఎంతటి విధేయుడినో చెప్పుకున్నారు. మొత్తానికి చూస్తే క్రిష్ణ దాస్ లో లోపల ఉన్న అసంతృప్తి అయితే అలా బయటపడింది అంటున్నారు. 

తనలాంటి వీర విధేయులకు మంత్రి కుర్చీ అయిదేళ్ళూ ఖాయం అని ఆయన భావించి ఉంటారు. ఇపుడు కాదు అని తెలుస్తున్న వేళ ఆయన బాధపడుతున్నట్లుగానే కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు. 

నిజమే ఎన్ని చెప్పుకున్నా మంత్రి పదవి అన్నది ఒక వైభోగం. మరి ఒకసారి మాజీ అయితే ఊహించుకోవడం ఎవరికైనా కష్టమే. కానీ జగన్ ఒక పాలసీ పెట్టుకుని మరీ పాత మంత్రివర్గం మొత్తాన్ని తొలగిస్తున్నారు. దాంతో సీనియర్లు, జూనియర్లు తేడా లేకుండా అందరూ ఎంతో కొంత అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి క్రిష్ణ దాస్ కూడా అతీతం కాదు, ఇది ఇంతే రాజకీయం అనుకోవాలి.