2019లో జగన్ సీఎం ఎట్టి పరిస్థితుల్లో కారు అని గొంతు చించుకున్నారు పవన్. కానీ జగన్ సీఎం అయ్యారు. తాను సీఎం సీఎం అంటూ ఎగిరిన పవన్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. 2024లో వైసీపీ అధికారంలోకి రాదు అని ఢంకా భజాయించి చెబుతున్నారు పవన్.
సరిగ్గా ఇక్కడే వైసీపీ జనాలు పండగ చేసుకుంటున్నారు. పవన్ అలా అన్నారంటే, జగన్ మరోసారి సీఎం అయినట్టేనంటూ కొత్త సెంటిమెంట్ ఎత్తుకున్నారు. పవన్ అన్నారంటే కచ్చితంగా దానికి రివర్స్ లో జరిగి తీరుతుంది. 2024లో కూడా వైసీపీకి బ్రహ్మాండమైన మెజార్టీ ఖాయం అనేది శ్రేణుల మాట.
నిలబడి దంచినా, ఎగిరెగిరి దంచినా పవన్ కల్యాణ్ కి వచ్చే ఓట్లు, సీట్లు ఎన్నో అందరికీ తెలుసు. అందులోనూ ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చను అనే కొత్త నినాదం ఎంచుకున్నారు. అసలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు ఉంటే కదా ఆయన చీల్చడానికి జనం అంతా జగన్ కి జై కొడుతున్న వేళ, పవన్ మళ్లీ జగన్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు.
జగన్ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానన్న పవన్, ఆ తర్వాత మాట మార్చారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రాదు అని ఘంటాపథంగా చెబుతున్న పవన్.. ఈసారి ఎలాంటి ప్రతిజ్ఞ చేస్తారో చూడాలి.
పవన్ అన్నారంటే అంతే..
ప్రజాక్షేత్రంలోనే ఉంటా, సినిమాలు చేయను, పాతికేళ్ల ప్రస్థానం కోసం కృషిచేస్తానని పవన్ నొక్కి మరీ చెప్పారంటే దానికి పూర్తిగా రివర్స్ లో చేస్తారు. అంటే పవన్ అంతకు ముందుకంటే ఎక్కువ సినిమాలు చేస్తారని అర్థం చేసుకోవాలి. ఆ నోటితో తథాస్తు అన్నారంటే దానికి పూర్తిగా రివర్స్ లో జరుగుతుందని అనుకోవాల్సిందే. ఆయన మాటంటే అదీ.
అందుకే ఇప్పుడు వైసీపీ కూడా పవన్ అన్నారు కాబట్టి కచ్చితంగా 2024లో వైసీపీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుందని సెటైర్లు వేస్తోంది. పవన్ కల్యాణ్ పల్టీ నాయకుడని, ఆయనకు పల్టీలు కొట్టడం బాగా వచ్చని ఎద్దేవా చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.
మొత్తమ్మీద పవన్ కూడా బీజేపీకి దూరం జరిగేందుకు, టీడీపీకి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని తాజా మీటింగ్ తో అర్థమైంది. వైసీపీకి కూడా ఇదే కావాలి. టీడీపీ-జనసేన కలిసినా, లేక టీడీపీ-జనసేన-బీజేపీ కలిసినా.. కూటమి పూర్తిగా మునగడం ఖాయం.