టీడీపీకి పెద్ద దిక్కు నారా చంద్రబాబు, చిన్న దిక్కు నారా లోకేష్. ఈ దిక్కులు రెండూ పనికిరాకుండా పోతున్నాయనేది పసుపు తమ్ముళ్ల ఆవేదన. అందుకే వాళ్లు ఎన్టీఆర్ దిక్కు చూస్తున్నారు. ఇలా చూస్తున్న వాళ్లందర్నీ తన దిక్కు తిప్పుకునేందుకు, 'నందమూరి' వంశాన్ని, 'ఎన్టీఆర్' అనే అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు మరో ఎత్తుగడ వేస్తున్నారు చంద్రబాబు.
తన కుటుంబం నుంచి మరో నారా వారసుడ్ని రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నారట. అతడే నారా రోహిత్. పూర్తిగా సినిమాలు తగ్గించేసిన నారా రోహిత్, కొత్త సినిమాలకు కూడా కమిట్ అవ్వడం లేదు. కొన్నాళ్లుగా గ్యాప్ లో ఉన్న ఈ హీరోను రాజకీయాల్లోకి దింపే ప్రయత్నం చేస్తున్నారట చంద్రబాబు. అలా టీడీపీకి మరో పిల్లర్ ఏర్పాటుచేయాలని ఆయన భావిస్తున్నారట.
నారా రోహిత్ ను చంద్రబాబు పిల్లర్ అనుకోవచ్చు కానీ కార్యకర్తలు నిజంగా అలా భావించే పరిస్థితి ఉందా? టీడీపీకి ఆయన పిల్లరు అవుతాడా.. లేక మరో నారా లోకేష్ అవుతాడా? అనేది కాలమే నిర్ణయిస్తుంది. అంతకంటే ముందు అసలు నారా రోహిత్ రాజకీయాల్లోకి నిజంగానే వస్తాడా, అతడికి ఆసక్తి ఉందా అనేది తేలాల్సి ఉంది.
తెలంగాణలో గతంలో జరిగిన ఎన్నికల్లో హరికృష్ణ కూతుర్ని బలవంతంగా రంగంలోకి దించి, ఆ కుటుంబాన్ని మరోసారి ఛీట్ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు నారా రోహిత్ ను కూడా అలా వాడుకొని వదిలేస్తారా? లేక నిజంగానే ప్రోత్సహిస్తారా? పక్కన రాజకీయంగా ఎదగలేని కొడుకును పెట్టుకొని చంద్రబాబు ఇలా మరో వ్యక్తిని ప్రోత్సహిస్తారంటే అది భ్రమే అవుతుంది.
రోహిత్ కంటే లోకేష్ బెటర్..
నారా రోహిత్ చాన్నాళ్లుగా సినిమాల్లో ఉన్నా.. ఎక్కడా ఎప్పుడూ హద్దుమీరి స్టేట్ మెంట్లు ఇవ్వలేదు. సినిమాలు, రాజకీయాలను కలపాలనుకోలేదు, వాటి ద్వారా లబ్ధి పొందాలని చూడలేదు. ఇంకా చెప్పాలంటే తన తండ్రిని ఇబ్బంది పెట్టింది చంద్రబాబే అని తెలిసినా కూడా పెద్దగా పట్టించుకోని బాపతు. అలాంటి వ్యక్తిని రాజకీయాల్లోకి దింపడానికి ఎందుకు చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టు.
బహుశా.. రోహిత్ ను బద్నామ్ చేసి, లోకేష్ ను పెద్దోడ్ని చేయడానికే ఈ ఎద్దుగడ వేసినట్టుంది. చిన్న గీత పక్కన దాని కంటే కాస్త పెద్దగీత అనే కాన్సెప్ట్ ఇది. చంద్రబాబు రాజకీయాల్లో ఎవరినీ పూర్తిగా నమ్మరు, ఎవరినీ పూర్తిగా ఎదగనీయరు. తెలుగు రాజకీయాల్లో వెన్నుపోటు గురించి, దాని పుట్టు పూర్వోత్తరాల గురించి, పార్టీని ఓవర్ టేక్ చేయడం గురించి బాబుకి తప్ప ఇంకెవరికీ పర్ఫెక్ట్ గా తెలియదు.
అందుకే ఆయన గతంలో హరికృష్ణ, బాలకృష్ణ, ఎన్టీఆర్ ని కూడా పూర్తిగా ఎదగనీయలేదు, ఎదగనీయరు కూడా. ఇప్పుడు రోహిత్ ని లైన్లోకి తెచ్చినా అతని వల్ల పార్టీకి మంచి జరుగుతుందనుకుంటే ఆహా ఓహో అంటారు, లేదంటే తన తమ్ముడి లాగే, తమ్ముడి కొడుకుని కూడా తొక్కేస్తారు.
2024లో అధికారం కోసం పరితపిస్తున్న చంద్రబాబు, తనకు కలిసొచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. అందులో ఒక అవకాశం నారా రోహిత్. అంతకు మించి ఇంకేం కాదు. దీని వల్ల రోహిత్ కు ఎలాంటి ఉపయోగం లేదు.