కొన్ని కేసులు ఎప్పటికీ కొలిక్కి రావు. ఏళ్లు గడిచినా చిన్న క్లూ కూడా దొరకదు. కానీ నేరం చేసిన వాడు ఏదో ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పే అతడ్ని పట్టిస్తుంది. ఈసారి కూడా అదే జరిగింది. తూర్పు గోదావరి జిల్లాలో నాలుగేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఓ మర్డర్ కేసు, ఓ వ్యక్తి తప్ప తాగి వాగడం వల్ల కొలిక్కి వచ్చింది.
తూర్పు గోదావరి జిల్లా చాగల్లుకు చెందిన హర్ష, 2018లో ఇంటర్మీడియట్ చదివేవాడు. దీపావళికి దారవరంలోని తాతయ్య ఇంటికి వెళ్లాడు. అక్కడ బిల్డింగ్ లో కూలీలుగా పనిచేస్తున్న రషీద్, ఆదిత్య, మునీంద్ర పరిచయమయ్యాడు. అంతా కలిసి సరదాగా క్రికెట్ ఆడుకునేవారు. ఓసారి వీళ్ల మధ్య పెద్ద గొడవ జరిగింది. రషీద్, ఆదిత్య, మునీంద్ర ఒక్కటయ్యారు. హర్షను ఒంటరిని చేశారు.
జరిగిన గొడవను మనసులోనే పెట్టుకున్న ఆ ముగ్గురూ, హర్షను చంపేయాలని ఫిక్స్ అయ్యారు. అనుకున్నట్టుగానే హత్య చేశారు. శవాన్ని ఎవ్వరికీ కనిపించకుండా, దగ్గర్లోనే నిరుపయోగంగా ఉన్న ఓ సెప్టిక్ ట్యాంక్ లో పడేశారు. ఈ ఘటన జరిగిన ఏడాది తర్వాత, అంటే 2019లో మరోసారి ముగ్గురూ కలిసి సెప్టిక్ ట్యాంక్ వద్దకు వచ్చారు.
అప్పటికే మృతదేహం అస్తిపంజరంగా మారింది. ముగ్గురూ కలిసి ఆ అవశేషాల్ని బయటకు తీసి రైల్వే గేటు సమీపంలోని కాలువలో పడేశారు. దీంతో ఇక తమను ఎవ్వరూ పట్టుకోలేరని భావించారు. 2018లోనే తన కొడుకు హర్ష కనిపించడం లేదని, అతడి తండ్రి ఫిర్యాదు చేయడంతో.. వీళ్ల ముగ్గురిపై పోలీసులు నిఘా వేసి ఉంచారు.
ఈ విషయం తెలియని రషీద్, మరికొంతమంది మిత్రులతో కలిసి మందు పార్టీలో కూర్చున్నాడు. అక్కడ కూడా మళ్లీ గొడవ జరిగింది. తాగిన మైకంలో ఉన్న రషీద్, తను ఆల్రెడీ ఓ హత్య చేశానని, మరో మర్డర్ చేయడం తనకు కష్టం కాదని, వాళ్లను బెదిరించాడు. ఈ విషయంలో పోలీసుల వరకు వెళ్లింది. రషీద్ ను అదుపులోకి తీసుకొని తమ స్టయిల్ లో ప్రశ్నించడంతో మొత్తం కక్కేశాడు రషీద్.
రషీద్ చెప్పిన ప్రకారం వెళ్లిన పోలీసులకు మరికొన్ని ఎముకలు దొరికాయి. ఇక మిగతా ఇద్దరు ఆదిత్య, మునీంద్ర పరారీలో ఉన్నారు. అలా తాగిన మైకంలో రషీద్ చెప్పడం వల్ల నాలుగేళ్ల నాటి కేసు కొలిక్కి వచ్చింది.