ప్రపంచంలో ఏదో ఒక మూల వింతలు-విశేషాలు జరుగుతుంటాయి. అలాంటి వింత మన పక్కనే జరిగితే ఆ ఆశ్చర్యం, షాకింగ్ మరో రేంజ్ లో ఉంటుంది. తెలంగాణలో అలాంటి వింత ఒకటి జరిగింది. తాగిన మత్తులో ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు. అక్కడితో ఆగలేదు. పొద్దున్నే ఆ ఇద్దరిలో ఒకడు, కాపురానికి అత్తారింటికి రావడంతో తమాషా మొదలైంది. జోగిపేటకు చెందిన ఆ వ్యక్తిని అంతా ఇప్పుడు జోగిపేట జాతిరత్నం అని పిలుస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా జోగిపేట్ కు చెందిన 21 ఏళ్ల యువకుడు, చండూర్ కు చెందిన 22 ఏళ్ల ఆటోడ్రైవర్ మంచి స్నేహితులు. ఓ కల్లు దుకాణంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. అలా వాళ్ల స్నేహం 3 కల్లు కాంపౌంట్లు, 6 పెగ్గులుగా విస్తరించి విరాజిల్లుతోంది. ఎప్పట్లానే 3 రోజుల కింద కూడా ఇద్దరూ కల్లు కాంపౌండ్ కు వెళ్లారు. ఆ రోజు కల్లు చాలా బాగున్నాయి. బహుశా కల్తీ కల్లేమో, ఇద్దరికీ బాగా ఎక్కేసింది.
తాగిన మైకంలో వాళ్ల మైండ్ పనిచేయలేదు. ఏం చేస్తున్నారో వాళ్లకే అర్థం కాలేదు. అలా ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే ప్రేమించుకున్నారు, ఆ మరుక్షణమే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అలా జోగిపేట జాతిరత్నం తన మెడలో మూడు ముళ్లు వేయించుకున్నాడు.
తెల్లారింది. ఎవరి పనుల్లో వాళ్లు పడ్డారు. మన జోగిపేట జాతిరత్నంకు మాత్రం తాగింది ఇంకా దిగలేదు. నేరుగా తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. తాళి కట్టావు కాబట్టి కాపురానికి వచ్చానన్నాడు. కాపురం చేయకపోతే పోలీస్ కేసు పెడాతనంటూ బెదిరించాడు. ఇరుగుపొరుగు వాళ్లు కాసేపు నవ్వుకున్నారు, సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ జాతిరత్నం వ్యవహారశైలి మారలేదు.
దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. తన మెడలో తాళి కట్టిన వ్యక్తిపై పోలీస్ కేసు పెట్టాడు జోగిపేట జాతిరత్నం. లక్ష ఇస్తే కానీ కేసు వాపసు తీసుకోనన్నాడు. విషయం సీరియస్ అవ్వడంతో రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు కూర్చున్నారు. ఇద్దరికీ సర్దిచెప్పారు. 10వేల రూపాయలకు వివాదాన్ని తెగ్గొట్టారు. ఇదీ మన జోగిపేట జాతిరత్నం చేసిన రచ్చ.