ఇలా జనసేన జెండా మీద గెలిచి అలా జెండా పీకేశారు రాపాక. గెలిచిన తర్వాత పాల్గొన్న మొదటి అసెంబ్లీ సమావేశానికే జై జగన్ అన్నారు. ముఖ్యమంత్రిని ఏకంగా దేవుడ్ని చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ముక్కున వేలేసుకునేలా జగన్ ను ఆకాశానికెత్తేశారు. మొత్తానికి అనుకున్నది సాధించారు. ఈజీగానే తన కొడుకును వైసీపీలో చేర్పించారు.
ఎమ్మెల్యేగా ఉంటూ తను వైసీపీ కండువా కప్పుకోలేడు కాబట్టి, కొడుకును ముందుకు నెట్టి సంతోషం పొందారు. ప్రస్తుతానికైతే రాజోలు నియోజకవర్గంలో రాపాక రాజ్యమే నడుస్తోందనుకున్నా, వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితేంటనేది పెద్ద క్వశ్చన్ మార్క్.
ప్రస్తుతానికైతే జనసైనికుల్లో రాపాకపై పూర్తిగా అసమ్మతి ఉంది. అక్కడ ఆయన రెండోసారి నిలబడితే కచ్చితంగా ఆయన్ని ఓడించడానికి వెనకాడరు. అదే సమయంలో స్థానికంగా వైసీపీ గ్రూపులు కూడా రాపాకకు పూర్తి స్థాయిలో మద్దతిచ్చేలా లేవు. ఈ దశలో రాపాక కూడా వైసీపీ నుంచి టికెట్ ఆశించట్లేదు, తనకు సీటు ఇవ్వకపోయినా కనీసం వైసీపీ తరఫున తన కొడుక్కు అయినా సీటు తెచ్చుకునేందుకు రాపాక పావులు కదుపుతున్నారు.
ఈ మేరకు ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడక్కడ అసమ్మతి ఉన్నప్పటికీ కొడుకు కోసం ఇప్పట్నుంచే తెగ కష్టపడుతున్నారు. అయితే జగన్ మనసులో ఏముందనేది రాపాకకు అంతుచిక్కడం లేదు. ఆల్రెడీ చేతిలో లిస్ట్ పెట్టుకున్న జగన్, రాజోలుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే టెన్షన్ రాపాకలో కనిపిస్తోంది.
టీడీపీ నుంచి వైసీపీ వైపు వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలలో ఎవరూ నెక్స్ట్ వైసీపీ నుంచి తాము అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని చెప్పుకోవడంలేదు. అంత ధైర్యం చేయరు కూడా. జగన్ నిర్ణయానికే వదిలేస్తున్నామంటున్నా గ్రౌండ్ వర్క్ మాత్రం చేస్తున్నారు. ఆ నలుగురి విషయం పక్కనపెడితే రాపాకకు స్థానికంగా పెద్ద పట్టు లేదనే చెప్పాలి. 2019లో కూడా గట్టి పోటీలో గట్టెక్కారు రాపాక. ఈసారి కూడా ఆయనకు టికెట్ కావాలి, కానీ ఎవరిస్తారనేదే ప్రశ్నగా మారింది.
జగన్ సింపతీ చూపిస్తే ఈజీగా గట్టెక్కేయొచ్చు. ఫ్యాన్ గుర్తుపై నెగ్గుకు రావొచ్చు. కానీ జగన్ హ్యాండ్ ఇస్తే మాత్రం రాపాకకు చుక్కలే. వైసీపీ రెబల్ గా ఆయన పోటీ చేయలేరు. అదే సమయంలో మరోసారి జనసేనలోకి వెళ్లలేరు. టీడీపీలోకి వెళ్లాలని ప్రయత్నించినా, అప్పటికీ జనసేనతో పొత్తు ఏర్పడడం ఖాయం. కాబట్టి ఆ ప్లాన్ కూడా వర్కవుట్ అవ్వదు. బీజేపీలో చేరినా ఒకటే, చేరకపోయినా ఒకటే.
అంటే.. రాజోలు నుంచి రాపాకకు కానీ, ఆయన తనయుడికి కానీ జగన్ టికెట్ ఇవ్వకపోతే ఇక ఆయన రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అనే చెప్పాలి. అందుకే వలస వచ్చిన ఎమ్మెల్యేలందరిలో రాపాక ఎక్కువ టెన్షన్ పడుతున్నారు.