సంపద సృష్టించేది అమరావతి
విశ్వనగరంగా విశాఖ
స్మార్ట్ సిటీగా తిరుపతి
బలమైన నగరంగా కర్నూలు
భలే వున్నాయి కదా ఈ పేర్లు. ఇవన్నీ పొలిటికల్ పార్ట్ టైమర్ పవన్ కళ్యాణ్ కాయిన్ చేసిన పేర్లు. సంపద కేవలం అమరావతి మాత్రమే సృష్టిస్తుందట. అసలు సంపద ఎలా తయారవుతుంది. ఉత్పాదకత వల్ల అమరావతిలో ఏం ఉత్పాదకత వుంది? విశాఖ దాని పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే అనకానేక పరిశ్రమలు వున్నాయి. పారిశ్రామిక వాడలు వున్నాయి. ఇంకా కొత్తగా వస్తున్నాయి. మరి ఇక్కడ సంపద తయారువుతుందా? లేక కేవలం భూములు మాత్రమే వున్న అమరావతిలో తయారవుతుందా?
అంటే భూములు అమ్మడం లేదా వివిధ సంస్థలకు అప్పగించడం వల్ల సృష్టించే సంపదే సంపదనా? మరి జగన్ ప్రభుత్వం భూములు విక్రయిస్తామంటే కొందరు కోర్టుకు వెళ్లడం, అమ్మడానికి వీల్లేదంటూ తీర్పు రావడం తెలిసిందే. మరి అమరావతి భూములు మాత్రం అమ్ముకోవచ్చా?
సరే, రాజధాని నగరం, విశ్వనగరం, స్మార్ట్ సిటీ అంటే తెలుసు. ఈ బలమైన నగరం అనే కొత్త పదం ఏమిటి? దీనికి అర్థం ఏమిటి పవన్ గారూ? అసలు ఓ నగరం బలంగా ఎలా తయారవుతుంది? పదం బాగుందని వాడేసారా? లేక అన్ని ప్రాంతాల పేర్లు చెప్పకుండా కేవలం అమరావతి పేరు చెబితే బాగోదని పవర్ స్టార్, మెగాస్టార్, మెగా పవర్ స్టార్ మాదిరిగా తలో బిరుదు పడేసారా?
వైకాపా సరే..మీరు వస్తారా?
వైకాపా అధికారంలోకి రాదు. ఇది పవన్ పడేసిన మరో స్టేట్ మెంట్. సరే, వాళ్లు రారు. మరి ఇంతకీ మీ సంగతి ఏమిటి? మీరు అధికారంలోకి రాగలరా? వస్తామని చెప్పగలరా? తెలుగుదేశంతో అధికారం పంచుకుంటామని చెప్పగలరా? ఎందుకంటే ఓట్లు చీలనివ్వం అనే తీర్మానం చేసామని ఘనంగా చెప్పుకుంటున్నారు. బాగానే వుంది. అలా చీలకూడదు అంటే మీరు-తేదేపా కలిసి పోటీ చేయాల్సిందే. అలా చేస్తే తేదేపా కనీసం 100 స్థానాలకన్నా ఎక్కువ చోట్ల పోటీ చేస్తుంది కానీ జనసేనకు 100 పైగా ఇచ్చేసి, తాను తక్కువ స్థానాలతో సర్దుకోదు కదా?
పోనీ పొత్తు ధర్మం కోసం తేదేపా కోసం వదలుకుంటారు అనుకుందాం. అప్పుడు అధికారంలోకి తేదేపా వస్తుంది కానీ జనసేన కాదు కదా? కేంద్రంలో మాదిరిగా ఎన్టీఎ, యుపిఎ లాంటి వ్యవహారం ఇక్కడ లేదు కదా? అప్పుడు ఏర్పడేది తేదేపా ప్రభుత్వమే. అంటే మరి జనసేన మోసింది తేదేపా పల్లకీనే కదా. మరి ఎవరి పల్లకీ మోయడానికి లేము అని ఎలా చెబుతారు?
ఊ..భయపడ్డారు..
చిన్నపిల్లలు కళ్లలోకి ఊది..భయపడ్డారు..భయపడ్డారు అని అంటూ సరదా పడుతుంటారు. పవన్ వ్యవహారం కూడా అలాగే వుంటుంది. తనను చూసి వైకపా వాళ్లకు భయం అని పదే పదే అనుకుని సంతృప్తి పడుతుంటారు. అసలు ఒక్క చోట కూడా గెలవలేకపోయిన పవన్ ను చూసి ఎవరైనా ఎందుకు భయపడాలి.
పవన్ వెనుక ఎంతో కొంత వున్న కాపు ఓటు బ్యాంక్ చూసి భయపడాలి అనుకుందాం. అలా భయం వుంటే జగన్, కాపుల రిజర్వేషన్ నా వల్ల కాదు అని ఎన్నికల ముందు అంత బలంగా చెప్పగలరా? మరింక పవన్ ను చూసి దేనికి భయం.
నాలుగు కాల్ షీట్ల మధ్య ఓ కాల్ షీట్ ను రాజకీయాలకు కేటాయిస్తూ వస్తున్న పవన్ పాపం ఇలాంటి ప్రసంగాలు చేస్తూ కాలక్షేపం చేయడమేనా, ఫుల్ టైమ్ రాజకీయాల్లోకి వచ్చేది వుందా?