చూస్తుంటే.. ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ పై మనసు పారేసుకున్నట్టుంది రష్మిక. ఇప్పటికే రెయిన్ బో పేరిట ఓ సినిమా చేస్తున్న ఈ నేషనల్ క్రష్, ఇప్పుడు తన పాత్ర చుట్టూ తిరిగే మరో కథను ఎంచుకుంది. ఈ సినిమా పేరు ది గర్ల్ ఫ్రెండ్.
ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు మంచి సెటప్ కుదిరింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, తన గీతాఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను డైరక్ట్ చేయబోతున్నాడు. సినిమా ఎనౌన్స్ మెంట్ లో భాగంగా విడుదల చేసిన వీడియో ఆసక్తికరంగా ఉంది. “ప్రపంచంలో గ్రేట్ లవ్ స్టోరీస్ చాలా ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఎవ్వరూ చూడని, వినని ప్రేమకథలు కూడా కొన్ని ఉంటాయి. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ అలాంటిదే” అంటూ ఈ సినిమాపై స్పందించింది రష్మిక.
ఈ కథ రాసుకున్నది రాహుల్ రవీంద్రనే. దీనికి స్క్రీన్ ప్లే-మాటలు కూడా ఆయనే రాసుకున్నాడు. మన్మధుడు-2 తర్వాత రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇదే.
ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన యానిమల్ సినిమా విడుదలకు సిద్ధమైంది. పుష్ప-2లో బన్నీ సరసన నటిస్తోంది. రెయిన్ బో సెట్స్ పై ఉంది. ధనుష్-శేఖర్ కమ్ముల, విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సినిమాలు కూడా లిస్ట్ లో ఉన్నాయి. రవితేజ-గోపీచంద్ మలినేని సినిమాలో కూడా నటించనుంది. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ అదనంగా వచ్చి చేరింది.