జనసైనికులారా మీదే భారం

ఏ క్షణమైతే తెలుగుదేశం పార్టీతో పొత్తును హడావుడిగా ప్రకటించారో, ఆ క్షణం నుంచి జనసేన గ్రాఫ్ కిందకు జారడం మొదలయింది. తమ అభిమాన హీరో, తమ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడని బలమైన కోరకతో వున్న…

ఏ క్షణమైతే తెలుగుదేశం పార్టీతో పొత్తును హడావుడిగా ప్రకటించారో, ఆ క్షణం నుంచి జనసేన గ్రాఫ్ కిందకు జారడం మొదలయింది. తమ అభిమాన హీరో, తమ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడని బలమైన కోరకతో వున్న జనాలు ఈ పొత్త ప్రకటనతో డీలా పడిపోయారు. పవన్ అక్కడితో ఆగకుండా మరో పదేళ్లు. చంద్రబాబే సిఎమ్ అనే అర్థం వచ్చేలా మాట్లాడడం ప్రారంభించారు. అక్కడితోనూ ఆగలేదు. చంద్రబాబు అనుభవశీలి. అలాంటి వారి నాయకత్వం రాష్ట్రానికి కావాలి అనడం మొదలుపెట్టారు. 

మరోపక్కన ముఫై సీట్లలో పోటీనా, నలభై సీట్లలో పోటీనా అన్న చర్చలు మొదలయ్యాయి. తెలుగుదేశం కాస్తో.. కూస్తో బలంగా వున్న చోట్ల కూడా ఆశలు పెట్టుకున్న జనసైనికులు వున్నారు. వారంతా ఇక తమకు పోటీ అవకాశం రాదు అని డిసైడ్ అయిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి జనసేనలో కూడా పదవులు అందుతున్నాయి. ఇవన్నీ జనసైనికుల్లో నీరసాన్ని నింపుతున్నాయి.

మరోపక్కన ఎవరినీ సంప్రదించకుండా తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ అని ప్రకటించేసారు. తీరాచేసి ఎన్నికలు వచ్చాక మొహం చాటేస్తున్నారు. పోటీ చేయాలా వద్దా అనే డిబేట్లు ఇప్పుడు మొదలుపెట్టారు. తాను ప్రకటించేసి, ఇప్పుడు నాయకులను అడగడం ఏమిటి? ఎందుకంటే ఇప్పుడు భయం మొదలైంది. తెలంగాణలో 32 చోట్ల డిపాజిట్లు రాకపోతే ఆ ప్రమాదం ఆంధ్ర ఎన్నికల మీద పడుతుంది. తెలుగుదేశంతో బేరం మీద పడుతుంది. తొందరపడి పవన్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆయననే ఇరుకున పెట్టింది.

దీంతో దిద్దు బాటు చర్యలు మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్. తాను సిఎమ్ పదవి తీసుకోవడానికి రెడీగా వున్నానని, కానీ ఆ పదవి కన్నా ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమని కొత్త పల్లవి అందుకున్నారు. కానీ ఫ్యాన్స్ కు ఇవేమీ పట్టవు. ఫ్యాన్స్ పునాదుల మీద వున్న పార్టీ అది. వాళ్లకి తమ నాయకుడు సిఎమ్ కావాలన్నదే కోరిక. పైగా కాపు సామాజిక వర్గంలోని చాలా మందికి ఈ పొత్తు రుచించడం లేదు.

అందుకే పవన్ మరోసారి సూక్తి ముక్తావళి మొదలు పెట్టారు. నాయకులే బాథ్యత తీసుకుని జనంలోకి తన భావాలను తీసుకెళ్లాలని కోరుతున్నారు. ఏమిటా? భావాలు?

ప్రజల కోసమే పొత్తు! ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి ‘రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కమ్యూనిస్టులతో కలిసినా, బీజేపీతో కలిసినా, టీడీపీతో పొత్తులో ఉన్నా అది ప్రజలకు మేలు చేయడానికే.ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.

జత కట్టకుండా పోటీ చేసిన పార్టీలు లేవు

నేను ఏ పార్టీకీ, నాయకుడికీ వ్యతిరేకం కాదు

వ్యక్తిగతంగా నన్ను దూషించినా శత్రువుగా పరిగణించను

పార్టీ ప్రతినిధులు పార్టీ కోసం మాత్రమే మాట్లాడాలి

మరెవరికో మద్దతుగా మాట్లాడవలసిన అవసరం లేదు

ఇదీ పవన్ సూక్తి ముక్తావళి. జతకట్టకుండా పోటీ చేసిన పార్టీలు లేవా? జగన్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసారు? పోనీ పవన్ గతంలో తేదేపాతో తరువాత భాజపాతో, ఇప్పుడు మళ్లీ తేదేపాతో పొత్తు పెట్టుకున్నారు. తరవాత మరే పార్టీతో? జనాలకు ముందు కావాల్సింది ఆ క్లారిటీ. ఒక్కో సీజన్ లో ఒక్కో పార్టీతో పొత్తు అంటే జనం ఎలా తీసుకుంటారు. ఇదంతా రాష్ట్రం కోసమే అంటే నమ్ముతారా?

పవన్ కు మరో భయం కూడా వుంది. ఏదో విధంగా జనాలను నమ్మించి, ముఫై లేదా నలభై సీట్లు తీసుకుని పోటీకి వెళ్తారు. తీసుకున్నవి అన్నీ గెలిస్తేనే గౌరవం. మర్యాద. కనీసం 70శాతం గెల్చినా ఓకె. అలా కాకుండా పదో, పదిహేనో గెలిస్తే పొత్తు పెట్టుకున్న పార్టీ ఏ మేరకు మర్యాద ఇస్తుంది. అప్పుడు కుక్కిన పేనులా వుండిపోవాలి. ఎందుకంటే మళ్లీ మాట మారిస్తే జనాల దగ్గర మర్యాద వుండదు. మార్చకపోతే పార్టీ మనుగడే వుండదు.

మార్చండి…మారిపోయా

ఇప్పుడు ఇన్ని సమస్యలు వున్నాయి కనుకనే పవన్ జనాల మనసు మార్చండి అంటూ పార్టీ నాయకుల భుజాల మీద భారం వేస్తున్నారు. ఇక్కడతో ఆగిపోలేదు. డబ్బులు ఇచ్చి రాజకీయం చేయలేను, నా దగ్గర డబ్బులు లేవు అనే పవన్ ఇప్పుడు అది కూడా మాట మార్చారు. ఖర్చు లేని రాజకీయాలు చేయాలని తాను ఎప్పుడూ చెప్పలేదని అంటున్నారు. ఏమంటున్నారు అంటే

‘’…జీరో బడ్జెట్‌ రాజకీయాలు అనే అంశం మీద తాను అభిప్రాయాలు చెప్పలేదని పవన్‌ తెలిపారు. ‘నేను అన్నది ఓట్లను నోట్లతో కొనే వ్యవస్థను మార్చే విధానం గురించి. అంతేగానీ ఎన్నికల ప్రక్రియలో కార్యకర్తలకు మంచినీళ్లు, టీ కూడా ఇవ్వకుండా పని చేయించుకోవడం గురించి చెప్పలేదు. ఈ వ్యవస్థలో మార్పు ఇప్పటికిప్పుడు సంభవిస్తుందని అనుకోవడం లేదు…’’

అంటే ఏమిటి దీని అర్థం. ఎన్నికల ప్రక్రియలో డబ్బులు అవసరమే. కార్యకర్తలకు ఇవ్వాల్సింది ఇస్తాము అని కదా చెబుతున్నారు ఇండైరెక్ట్ గా. ఈ లెక్కన మరి ఓటర్లకు కూడా ఇవ్వాల్సింది ఇవ్వాలనే చెబుతారేమో? వ్యవస్థలో మార్పు ఇప్పటికిప్పుడు వస్తుందని అనుకోవడం లేదు అంటున్నారు. ఇప్పటికే కాదు ఎప్పటికీ రాదు. ఎందుకంటే పోనీ పల్లెల్లో వున్న నిరక్షరాస్య ఓటర్ల డబ్బులు తీసుకుని వేస్తారేమో, ఆ తరువాత తరం మారుతుందేమో అని అనుకోవచ్చు. కానీ స్విగ్గీ, జొమాటో కూపన్లు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ లు లేకుండా హైదరాబాద్ లాంటి చొట్ల నిరసన చేయలేకపోతున్నారు కదా.

మొత్తం మీద ఒంటరిగా పోటీ చేయలేక, బాబుతో పొత్తు పెట్టుకోకుండా వుండలేక పవన్ పడుతున్న బాధలు ఇన్నీ అన్నీ కావు.