ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందనే సామెత చందాన… టీడీపీతో పొత్తు జనసేన పతనానికి దారి తీస్తోంది. టీడీపీతో పొత్తుపై జనసేనలో లావాలా పేరుకుపోయిన కోపాగ్ని నెమ్మదిగా కట్టలు తెంచుకుంటోంది. జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని, టీడీపీ-వైసీపీలకు ప్రత్యామ్నాయ రాజకీయాలను పవన్‌కల్యాణ్ నడుపుతారని ఇంత కాలం ఆయన అభిమానులు నమ్మారు, ఆశించారు. అయితే ఎన్నికల సమీపిస్తున్న సమయానికి పవన్‌కల్యాణ్ అసలు రూపం బయట పడింది.
చంద్రబాబు దత్త పుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నేతల ఆరోపణల్లో నిజం వుందని ఇప్పుడిప్పుడే జనసేన శ్రేణులకు కూడా అర్థమవుతోంది. అందుకే ఆత్మాభిమానం చంపుకుని చంద్రబాబు, లోకేశ్ రాజకీయ పల్లకీని మోయలేమంటూ జనసేన నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ప్రశ్నించడమే సిద్ధాంతంగా అవతరించిన పార్టీగా జనసేన గురించి పవన్ ఎంతో గొప్పగా చెప్పారు.
తమ అభిమాన హీరో, రాజకీయ నాయకుడైన పవన్‌కల్యాణ్ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని, టీడీపీతో పొత్తుపై జనసేన కార్యకర్తలు, నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని జనసేన నాయకత్వం…అలాంటి వారిని పార్టీ నుంచి గెంటివేస్తోంది. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా అన్నమయ్య జిల్లా నందలూరు మండలానికి చెందిన కార్యకర్త నరసయ్య నిలుస్తున్నారు.
ఇటీవల కాలంలో జనసేనకు దూరమైన వారంతా పవన్‌కల్యాణ్ వీరాభిమానులే కావడం గమనార్హం. నెల్లూరు, పిఠాపురం జనసేన ఇన్‌చార్జ్‌లు కేతంరెడ్డి వినోద్, మాకినేని శేషుకుమారి, అలాగే తిరుపతికి చెందిన పసుపులేటి సురేష్, దిలీప్ సుంకర, తాజాగా రాయలసీమ ప్రాంతీయ మహిళా సమన్వయకర్త పసుపులేటి పద్మావతి ఉన్నారు. పసుపులేటి పద్మావతి గురించి గతంలో పవన్‌కల్యాణ్ ఎంతో గొప్పగా చెప్పారు. ఇలాంటి పోరాట యోధురాలు ఒక పది మంది తన వెంట వుంటే చాలని పవన్ చేసిన కామెంట్స్, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అలాంటి నాయకులు కూడా జనసేన నుంచి బయటికి రావడం …ఆ పార్టీ పతనానికి సంకేతాలని చెప్పొచ్చు. టీడీపీతో పొత్తు, అలాగే జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ అణచివేత చర్యలే తనను బాధించాయని, ఇక ఆ పార్టీలో ఉండలేనంటూ తన రాజీనామా లేఖలో పద్మావతి ప్రస్తావించారు. టీడీపీతో పొత్తుపై క్షేత్రస్థాయిలో జనసేన శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వుందనే వాస్తవం వీళ్ల రియాక్షన్స్ ద్వారా అర్థమవుతోంది. కానీ పవన్‌కల్యాణ్ మాత్రం ఫీల్ గుడ్ అంటూ ముందుకెళ్లడం పార్టీకి నష్టం కలిగించే అంశం. తాజాగా పొత్తుపై పవన్ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.
‘రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కమ్యూనిస్టులతో కలిసినా, బీజేపీతో కలిసినా, టీడీపీతో పొత్తులో ఉన్నా అది ప్రజలకు మేలు చేయడానికే. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి’ అని తన పార్టీ ప్రతినిధులకు పవన్ పిలుపునిచ్చారు. జనసేనాని పవన్ ఒక్కో ఎన్నికల్లో ఒక్కో రకంగా పొత్తు కుదుర్చుకోవడం వెనుక వ్యూహం ఏంటో జనానికి బాగా తెలుసు. అందుకే 2019 ఎన్నికల్లో కర్రుకాల్చి పవన్‌కు వాతలు పెట్టారు.
పొత్తు గురించి ప్రజలకు కాదు, ముందు తన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఒప్పిస్తే జనసేనకు భవిష్యత్ వుంటుందని పవన్ గ్రహించాలి. తన నిర్ణయానికి సొంత పార్టీ శ్రేణుల నుంచే ఆమోదం లభించని పరిస్థితిలో, ఇక జనం పట్టించుకుంటారని పవన్ ఎలా అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. పొత్తు ప్రకటన తర్వాత జనసేన నుంచి బయటికి వెళ్లే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ప్రశ్నిస్తున్న కొందరు నాయకుల్ని నాయకత్వమే గెంటేస్తోంది. జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వారిని కూడా బయటికి పంపే పరిస్థితి వుందని బహిరంగంగానే అంటున్నారు.
ఒకవైపు జనసేన నుంచి పిట్టల్లా కార్యకర్తలు, నాయకులు రాలిపోతుంటే… తాజాగా ఆ పార్టీకి చెందిన కోస్తా నాయకురాలు ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
‘తులసివనం గంజాయి వనంగా మారుతుంటే తులసి మొక్కలు ఇమడలేకపోతున్నాయి. అందుకే వనానికి గుడ్ బై చెబుతున్నాయి’ అని జనసేన నాయకురాలు ఆవేదనతో పెట్టిన పోస్టును ఆ పార్టీ సోషల్ మీడియాలోనే చక్కర్లు కొడుతోంది. జనసేన అంతోఇంతో ఆశలు పెట్టుకున్న ఉభయగోదావరి జిల్లాల్లోని జనసేన నాయకుల నుంచి ఇలాంటి నిర్వేదంతో కూడిన పోస్టులు రావడం ఆ పార్టీకి ఆందోళన కలిగించే అంశం.
జనసేనను ఒక్కొక్కరుగా ఎందుకు వీడుతున్నారో ఇప్పటికైనా ఆ పార్టీ నాయకత్వం ఆలోచించాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటామంటే ప్రయోజనం లేదు. ఇదే రీతిలో జనసేన రాజకీయ పంథా కొనసాగితే, తనకు తానుగా సమాధి కట్టుకోడానికి సిద్ధపడినట్టుగా అర్థం చేసుకోవాల్సి వుంటుంది. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప, హత్యలుండవని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.