కూతురు పుట్టిన ఆనందంలో ఉన్నాడు రామ్ చరణ్. మెగా కాంపౌండ్ లో సంబరాలు జరుగుతున్నాయి. రోజూ ఎవరో ఒకరు వస్తున్నారు, ఏదో ఒక పార్టీ కనిపిస్తోంది. దీంతో తను చేస్తున్న సినిమాకు లాంగ్ గ్యాప్ ఇచ్చాడు చరణ్. కొన్నాళ్ల పాటు భార్య, కూతురుతో పాటు ఉండాలని డిసైడ్ అయ్యాడు.
ఈ నేపథ్యంలో, చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా మరోసారి వాయిదా పడబోతోందనే పుకారు మొదలైంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా, దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ప్రారంభమై చాన్నాళ్లయింది.
ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు. ఆ తర్వాత సంక్రాంతి నుంచి సమ్మర్ కు పోస్ట్ పోన్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో సమ్మర్ కు కూడా ఈ సినిమా రాదనే టాక్ మొదలైంది.
అటు శంకర్ కూడా బిజీగా ఉన్నాడు. ఇండియన్ 2ను కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. ఈ సినిమాను పొంగల్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదే కనుక జరిగితే, విడుదలకు 2 నెలల ముందు నుంచి శంకర్ బిజీ అయిపోతాడు. ఆ ప్రభావం గేమ్ ఛేంజర్ పై పడుతుంది.
ఇటు నిర్మాత దిల్ రాజు మాత్రం, అసలు గేమ్ ఛేంజర్ సినిమాకు ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదని చెబుతున్నారు. సినిమా రిలీజ్ కు సంబంధించి ఎలాంటి ప్లాన్స్ లేవని, షూటింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటామని అంటున్నాడు. సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయిందని చెబుతున్నాడు.