మొన్నటికిమొన్న మహేష్ బాబు సినిమాలో మెయిన్ హీరోయిన్ పోస్ట్ ఖాళీ అయింది. పూజాహెగ్డే తప్పుకోవడంతో (తొలిగించారని కొందరు అంటారు) ఆ స్థానంలో మరో హీరోయిన్ కోసం వెదికారు. ఇందులో భాగంగా కొంతమంది పేర్లు అనుకున్నారు. కానీ చివరికి అదే సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా చేస్తున్న శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా మార్చేశారు.
అంతకంటే ముందు ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి కూడా ఇంతే. ఈ సినిమాకు కూడా హీరోయిన్ సమస్య ఉండేది. దర్శకుడు హరీశ్ శంకర్, పూజాహెగ్డే కోసం తెగ ట్రై చేశాడు. చివరికి శ్రీలీలతో సర్దుకుపోయాడు.
ఈ రెండు కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలా చెప్పుకుంటూపోతే మరో 2 సినిమాలు కూడా తెరపైకొస్తాయి. ఇలా స్టార్ ఎట్రాక్షన్ ఉన్న సినిమాలకు హీరోయిన్ దొరకడం కష్టంగా మారుతున్న వేళ.. మేకర్స్ ఎవరూ సమంత పేరును పరిశీలించకపోవడం ఆశ్చర్యకరం.
స్టార్ హీరోల సరసన గ్లామర్ రోల్స్ చేయకూడదని సమంతానే సొంతంగా నిర్ణయం తీసుకుందా.. లేక సమంతను పక్కనపెట్టాలని, హీరోలంతా మూకుమ్మడిగా డిసైడ్ అయ్యారా అనేది తేలాల్సి ఉంది.
సమంత గ్లామర్ రోల్స్ చేస్తే చూడాలని చాలామంది ప్రేక్షకులకు ఉంది. మరీ ముఖ్యంగా పవన్, మహేష్, ప్రభాస్ లాంటి హీరోల సరసన సమంతను చూడాలని చాలామందికి ఉంది. పుష్పలో ఆమె ఐటెంసాంగ్ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. కాబట్టి గ్లామర్ డోస్ విషయంలో సమంతను సంశయించాల్సిన పనిలేదు.
సమంత సొంత నిర్ణయమేనా..!
ఎటొచ్చి సమంతానే ఇలాంటి పాత్రలకు దూరంగా జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈమధ్య కాలంలో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉండే కథల్ని మాత్రమే ఆమె సెలక్ట్ చేసుకుంటోంది. ఇందులో భాగంగా స్టార్ హీరోలకు దూరంగా జరిగింది. అయితే శాకుంతలం ఫ్లాప్ తర్వాత, ఆమె మైండ్ సెట్ మారిందని చెబుతున్నారు దగ్గరివాళ్లు. ఓ పెద్ద హీరో సినిమాలో గ్లామర్ రోల్ పోషించాలని ఆమె అనుకుంటోందంట.
ఈ ఫీలర్లే నిజమైతే, మహేష్ సినిమాలో ఆమెకు మెయిన్ హీరోయిన్ రోల్ వచ్చి ఉండేది. కానీ అలా జరగలేదు. బహుశా, త్రివిక్రమ్ లాంటి దర్శకుడు చొరవ తీసుకుంటే, సమంత మనసు మారొచ్చేమో.