మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి రాజకీయ జీవితం అంతా అవకాశం వాదమేనా? అంటే …ఔననే సమాధానం వస్తోంది. 1983లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆనం రామనారాయణరెడ్డి , ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పలుమార్లు ఓడిపోయారు. ఆనం రామనారాయణరెడ్డికి రాజకీయంగా విలువలు, నైతికత పెద్దగా పట్టింపు ఉన్నట్టు కనిపించదు.
ప్రజల నాడిని పసిగట్టి, అధికారంలోకి వచ్చే పార్టీలోకి జంప్ కావడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. వైఎస్సార్ హవా ఉన్నప్పుడు, ఆయనకు నమ్మకస్తుడిగా మెలిగారు. వైఎస్సార్ కేబినెట్లో మంత్రిత్వ పదవిని దక్కించుకుని, అధికారాన్ని అనుభవించారు. వైఎస్సార్ మరణం, రాష్ట్ర విభజన తదితర కారణాలతో ఆయన కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. నాడు వైఎస్ జగన్‌ను ఆర్థిక ఉగ్రవాది అంటూ తీవ్ర విమర్శ చేశారు. టీడీపీ హయాంలో అధికారాన్ని అనుభవించి, ఆ పార్టీపై ప్రజాదరణ ఉందని గుర్తించారు.
దీంతో 2019కు వచ్చే సరికి వైసీపీలో చేరారు. అయితే ఆనం అవకాశవాదానికి జగన్ చెక్ పెట్టారు. తన వెన్నంటి నడిచిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌కు మంత్రి పదవి ఇవ్వడాన్ని ఆనం జీర్ణించుకోలేకపోయారు. అనిల్ తర్వాత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మంత్రి పదవి దక్కింది. నెల్లూరు జిల్లాలో సీనియర్ అయిన తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆనం వైసీపీలో ఇబ్బందిపడుతూ కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో వైసీపీ నుంచి బయటపడ్డారు.
ఇప్పుడు టీడీపీ పంచన చేరారు. నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర వుంది. ఆ వారసత్వాన్ని రామనారాయణరెడ్డి కొనసాగిస్తున్నారు. తాజాగా చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే… అక్కడి నుంచి బరిలో వుంటానని ఆయన చెప్పారు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో వుంటూ, ఇప్పటికీ తనకంటూ సొంత ఇమేజ్ను ఏర్పరచుకోకపోవడం ఆయన అవకాశవాద రాజకీయానికి నిదర్శనమని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
నెల్లూరు సిటీలో తనపై ఆనం పోటీ చేసి గెలిస్తే, రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని అనిల్‌కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. దాన్ని స్వీకరించడానికి బదులు కాకమ్మ కథలు చెప్పడం ఆనంకే చెల్లింది. రాజకీయాలను వాడుకుని తన కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవడం తప్ప, ఆనం వల్ల నెల్లూరు జిల్లాకు ఒరిగిందేమీ లేదనే టాక్ వినిపిస్తోంది.