ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మరోసారి ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశంసలు కురిపించారు. ఇవాళ ఆయన కడపకు వెళ్లారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో తీసుకున్న సానుకూల నిర్ణయాలను స్వాగతించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించిం దన్నారు. ఇందుకు ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారన్నారు. అలాగే సీపీఎస్ రద్దు చేయడం శుభపరిణామం అని ఆయన అన్నారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు తాము సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన చెప్పుకొచ్చారు. సమస్యలపై సానుకూలంగా స్పందించి, వాటిని పరిష్కరించిన సీఎం జగన్‌తో పాటు సీఎస్ జవహర్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలని బొప్పరాజు అన్నారు.
200 శాఖలను మూడు విభాగాలుగా విడదీసి అందరితో చర్చించడం అభినందించదగ్గ విషయమన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పని చేస్తున్నారన్నారు.
ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించాలని ఆయన కోరారు. తక్కువ జీతం వచ్చే వారికి రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాలను యథావిధిగా కొనసాగించాలని ఆయన కోరారు. సీఎఫ్ఎంఎస్‌లో పేరు ఉన్న కారణంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రేషన్ కార్డులు, ఇతర పథకాలు ఆగిపోయాయని ఆయన తెలిపారు.