మొత్తానికి రంగంలోకి దిగారు హీరో రవితేజ. ఇన్నాళ్లు హ్యాపీగా రెమ్యూనిరేషన్ తీసుకుంటూ, సినిమా సక్సెస్, ఫ్లాపులతో సంబంధం లేకుండా హ్యాపీగా గడిపేస్తున్న రవితేజ, ఇప్పుడు నిర్మాణ రంగంలోకి దిగారు.
తమిళ హీరో విష్ణు విశాల్ హీరోగా సినిమా నిర్మిస్తున్నారు. మట్టి కుస్తీ పేరుతో తయారయ్యే ఈ సినిమా టైటిల్ ను ఈ రోజు అధికారికంగా ప్రకటించారు.
దాదాపు ఏడాది కాలంగా రవితేజ తన స్వంత ప్రొడక్షన్ మీద కసరత్తు చేస్తున్నారు. చెల్లా అయ్యవు అనే కొత్త డైరక్టర్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ కూడా నటిస్తాడా? లేదా? అన్నది ప్రస్తుతానికి దాచారు. రవితేజ ఓ స్పెషల్ రోల్ లో కనిపిస్తాడనన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్.
జస్టిస్ ప్రభాకరన్ సంగీతం అందించే ఈ సినిమాకు రిచర్డ్ సినిమాటోగ్రాఫర్. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తయారవుతుంది. విష్ణు విశాల్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.
విష్ణు విశాల్ రెండేళ్ల క్రితం తెలుగు క్రీడా సెలబ్రిటీ గుత్తా జ్వాలను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి తెలుగులో కూడా సరైన ఎంట్రీ ఇవ్వడానికి చూస్తున్నారు.