దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక్కడ మేకపాటి కుటుంబం పోటీ చేస్తే ఆ సీటు వైసీపీకి ఏకగ్రీవం అవుతుందనే అంచనాలున్నాయి.
గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఆయన్ను అజాత శత్రువుగా కీర్తిస్తూ అన్ని పార్టీల నేతలు నివాళులర్పించారు. గౌతమ్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు. దాదాపుగా అన్ని పార్టీల నేతలు గౌతమ్ తండ్రి, మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డిని కలిశారు. ఆయనకు అండగా ఉంటామని చెప్పారు.
ఈ నేపథ్యంలో ఎన్నికలు వచ్చినా గౌతమ్ రెడ్డి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే.. పోటీకి ఎవరూ సిద్ధపడకపోవచ్చని అనుకున్నారు. కానీ అనూహ్యంగా మేకపాటికి పోటీదారు బయటకొచ్చారు. ఆయన ఇంకెవరో కాదు, మేకపాటి రాజమోహన్ రెడ్డికి స్వయానా మేనల్లుడు. పేరు బిజివేముల రవీంద్రా రెడ్డి.
ఇప్పటి వరకూ ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు కానీ.. తాను మాత్రం బీజేపీ నేతను అని చెప్పుకుంటున్నారు బిజివేముల రవీంద్రా రెడ్డి. నెల్లూరులో ఓ పెద్ద హోటల్ లో ప్రెస్ మీట్ పెట్టి, మీడియాను సంతోషపరిచి మరీ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. మేకపాటి కుటుంబ సభ్యులపై ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కుదిరితే బీజేపీ టికెట్ పై పోటీ చేస్తాను, లేకపోతే ఇండిపెండెంట్ గా అయినా బరిలో దిగుతానన్నారు.
రాజకీయం మారదు కానీ..
బిజివేముల రవీంద్రా రెడ్డి అనే సదరు నాయకుడు బీజేపీ తరపున పోటీ చేసినా, ఇండిపెండెంట్ గా బరిలో దిగినా పెద్ద తేడా ఏమీ ఉండదు. ఆయనకు వచ్చే ఓట్లు ఎన్నో ఆయనకే తెలియదు. సో పోటీ లేదు కానీ.. ఇదో పెద్ద పబ్లిసిటీ స్టంట్ అని మాత్రం చెప్పుకోవాలి.
బీజేపీ ఇక్కడ అభ్యర్థి కోసం వెదుకుతున్నా.. స్థానికంగా తమ పేరు చెడగొట్టుకోవాలని ఎవరికీ లేదు. అందుకే పోటీకి వెనకాడుతున్నారు స్థానిక బీజేపీ నేతలు. ఈ సమయంలో వారికి బిజివేముల దొరికారు.
ఇప్పటికే కరెంటు చార్జీలు, ఇతరత్రా వ్యవహారాలపై సీఎం జగన్ నిర్ణయాలను విభేదిస్తున్న ప్రతిపక్షాలు ఆత్మకూరులో కూడా కాస్త హడావిడి చేయొచ్చు. దొరక్క దొరక్క దొరికిన ఆ అభ్యర్థిని అడ్డు పెట్టుకుని హడావిడి చేయొచ్చు.
ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ లెక్కలు వేసుకుంటున్నాయి, మేకపాటి కుటుంబానికి వ్యతిరేకంగా పావులు కదిపేందుకు దుస్సాహసం చేస్తున్నాయి. అయితే వీరందరికీ మేకపాటి అభిమానులు గట్టి సమాధానం చెబుతారనడంలో సందేహం లేదు. అలా తిరుపతిలో ఎదురైన పరాభవమే, ఆత్మకూరులో కూడా బీజేపీకి ఎదురుకాబోతోంది. ఇది ఫిక్స్.