ఏ ముహూర్తాన పెట్రోల్ ధరలను రోజువారీగా మార్చడం మొదలుపెట్టారో కానీ.. అప్పటి నుంచినే వాటికి రెక్కలు వచ్చాయి. దాదాపు నాలుగేళ్ల కిందట మోడీ సర్కారు తెచ్చిన విధానం ఇది. అప్పటి నుంచి పెట్రో ధరలు దాదాపు యాభై శాతం వరకూ పెరిగాయంటే ఆశ్చర్యం లేదు!
నాలుగేళ్ల కిందట వెయ్యి రూపాయలకు దాదాపు 14 లీటర్ల పెట్రోల్ లభించేది. ఇప్పుడు వెయ్యి రూపాయలకు ఎనిమిది లీటర్ల పెట్రోల్ రావడం గగనంగా మారింది! ఇదీ పెట్రో ధరల పెరుగుదల తీర. అదేమంటే.. ఇన్నాళ్లూ అంతర్జాతీయ పరిణామాలు అంటూ వాదించేవారు. గతంతో పోలిస్తే… అంతర్జాతీయంగా పెట్రో ధరలు మూడో వంతకు పడిపోయిన సందర్భంలో కూడా.. దేశంలో మాత్రం ఆ మేరకు ధరలు తగ్గలేదు.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా, పాతాళానికి పడిపోయినా.. ఇండియాలో మాత్రం పెట్రో ధరలు పై పైకే చేరుతూ ఉన్నాయి. ఇది ఎలా మారిందంటే.. పెట్రో ఉత్పత్తుల ధరలు ఏవైనా.. ఈ రోజే చౌక! రేపు వాటి ధరలు మళ్లీ పైకి పెరగడమే తప్ప, ఇక తగ్గేది కల అన్నట్టుగా మారింది పరిస్థితి. రోజువారీ.. 80 పైసలు, రూపాయి.. ఇలా ధర పెంచుతూనే ఉన్నారు!
ఆల్రెడీ లీటర్ పెట్రోల్ ధర 120 రూపాయలను క్రాస్ అయ్యింది. తను గద్దెనెక్కిన సమయంలో 72 రూపాయలుగా ఉన్న పెట్రో ధర విషయంలో మోడీ సాధించిన ప్రగతి ఇది. ఎనిమిదేళ్ల వ్యవధిలో ఏకంగా 48 రూపాయల ధరను పెంచారు ప్రతి లీటర్ మీదా! అదేమంటే రాష్ట్రాల పన్నులు అంటూ భక్తులు వాదిస్తారు. అయితే రాష్ట్రాలకు ప్రతి లీటర్ పై ఇప్పుడు దక్కేది రూపాయి రెండు రూపాయలే అని, సెస్ ల రూపంలో దోపిడీ అంతా కేంద్రానిదే అంటూ పార్లమెంట్ లోనే ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్రస్తావిస్తున్నారు!
ఏతావాతా.. రోజుకు అర్ధ రూపాయి నుంచి, రూపాయి, రెండు రూపాయల వరకూ.. పెరగడం మాత్రం ఖాయం! ఈ పెరుగుదలల్లో ఈ రోజే చౌక, రేపటి నుంచి ఇంకాస్త ధర పెరగడమే తప్ప.. మరో ఊరట ఏదీ ఉండదని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి స్పష్టత ఇస్తోంది ప్రజానీకానికి. మరి ఇదే తీరున అతి తక్కువ రోజుల్లోనే.. లీటర్ పెట్రోల్ నూటా యాభై రూపాయలు, అంతకు మించి.. రెండు వందల రూపాయల వరకూ చేరినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు! అంతా మోడీ మాస్టర్ స్ట్రోక్, అచ్చేదిన్ అంటే ఇవే మరి!