కొత్త కేబినెట్ కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాజిక సమీకరణలకు పెద్దపీట వేస్తున్నారు. ఇది ఎన్నికల కేబినెట్ కావడంతో బీసీలు, మైనార్టీలు, దళితులకు ఎక్కువ మంత్రి పదవులు కట్టబెట్టేందుకు జగన్ నిర్ణయించినట్టు సమాచారం.
ఇందులో భాగంగా అనంతపురం , కర్నూలు జిల్లాల్లో బలమైన సామాజిక వర్గానికి ఏకైక ప్రతినిధిగా ఉన్న గుమ్మడి జయరాం, అలాగే రాష్ట్రంలో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాల్, ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలం సురేష్లను తిరిగి కొనసాగిస్తారనే చర్చ జరుగుతోంది.
కులాల ప్రాతిపదికన కొందరు అనర్హులకు కూడా ప్రాధాన్యం ఇస్తుండడంపై వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. కొంత మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. కుల సమీకరణల నేపథ్యంలో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎంపికైన వారికి కూడా మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం… అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరికి పిచ్చెక్కిస్తున్నంత పని అవుతోందని సమాచారం.
ఇందుకు విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తే నిదర్శనం. కేబినెట్ మొత్తాన్ని తొలగిస్తే సమస్య లేదని, అయితే తన జిల్లాకు చెందిన ఆదిమూలం సురేష్‌ను కొనసాగించాలని సీఎం నిర్ణయించడంపై బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
ఆదిమూలాన్ని కొనసాగింపు, అలాగే తన తొలగింపుపై సీఎం ముందుగానే బాలినేనికి తెలిపారు. ఇదే జరిగితే జిల్లాలో నెగెటివ్ సంకేతాలు వెళ్తాయని బాలినేని చెప్పినప్పటికీ, సీఎం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని సమాచారం. దీంతో బాలినేని అలకబూని హైదరాబాద్‌కు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు సీఎంతో భేటీకి బాలినేని శ్రీనివాసరెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకెళ్లారు. సీఎంతో చర్చించిన తర్వాత కూడా బాలినేనిలో అసంతృప్తి, అసహనం కనిపించడం గమనార్హం.
సీఎంకు దగ్గరి బంధువైన బాలినేనిలోనే కేబినెట్ కూర్పుపై అసంతృప్తి ఉంటే, ఇక మిగిలిన వారి సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త కేబినెట్ పేర్లు వెల్లడైన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు మరెన్ని షాక్‌లకు గురి కావాల్సి వుంటుందో మరి!