స్వాగతాలు ఎక్కువైపోతున్నాయి బాబాయ్

వైవీ సుబ్బారెడ్డి. ముఖ్యమంత్రి జగన్ సొంత బాబాయ్. ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఆయనకు ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు విజయనగరం జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పగించారు. దాంతో బాబాయ్ ది షటిల్…

వైవీ సుబ్బారెడ్డి. ముఖ్యమంత్రి జగన్ సొంత బాబాయ్. ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఆయనకు ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు విజయనగరం జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పగించారు. దాంతో బాబాయ్ ది షటిల్ సర్వీస్ అవుతోంది.

ఆయన హైదరాబాద్ వయా తిరుపతి విశాఖ గా విమానాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు విశాఖలో ఉదయం ఉంటే సాయంత్రం తిరుపతిలో ఉంటారు. ఇలా వైవీ సుబ్బారెడ్డి ఒక వైపు టీటీడీ పదవిని హోల్డ్ చేస్తూనే మరో వైపు విశాఖ వంటి కీలక జిల్లాలో వైసీపీ వ్యవహారాలు చూడడం అంటే తలకు మించిన భారమే.

వారంలో కనీసం నాలుగైదు సార్లు వైవీ విశాఖ విమానాశ్రయంలోనే స్వాగతాలు అందుకుంటూ ఉంటారు. దాంతో వైవీకి స్వాగతాలే ఎక్కువ అయిపోతున్నాయని సొంత పార్టీలోనే అనుకునే పరిస్థితి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ విశాఖ వైసీపీ వ్యవహారాలకే ఆయన పూర్తి స్థాయిలో సమయం వెచ్చిస్తే బాగుంటుంది అని అంతా కోరుకుంటున్నారు.

వైవీ సుబ్బారెడ్డి వస్తున్నారు. ఎవరూ శాలువాలు తీసుకురావద్దు అంటూ పార్టీ నాయకులకు ఒక సందేశం వెళ్తుంది. ఇది కూడా వైసీపీలో సరదా చర్చకు దారితీస్తోంది. ఈ లెక్కనే వైవీకి స్వాగతాలు ఎక్కువ అయిపోతున్నాయని పార్టీ వారు అంచనా వేసి చెప్పుకుంటున్నారు. పార్టీ కోసం పూర్తి సమయం వెచ్చించండి బాబాయ్ అని కూడా కోరుకుంటున్నారు.