సుమారు మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ అన్ని రంగాల్లో ప్రక్షాళన చర్యలు చేపట్టారు. ఇప్పటికే పార్టీపై ఆయన పూర్తి దృష్టిసారించారు. ఈ మేరకు వైసీపీ బాధ్యతల్ని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అప్పగించారు. పార్టీని బలోపేతం చేసి మరో రెండేళ్లలో జరగనున్న ఎన్నికల్లో ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొనేందుకు వైసీపీ శ్రేణుల్ని సమాయత్తం చేసే పనిలో విజయసాయిరెడ్డి ఉన్నారు. పాలనలో కూడా సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కొత్త జిల్లాల పునర్వ్యస్థీకరణను పకడ్బందీగా చేపట్టారు.
ఈ క్రమంలో కేబినెట్ పునర్వ్యస్థీకరణ కూడా చేపట్టనున్నారు. అమాత్య పదవి కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు నానా తంటాలు పడుతున్నారు. ప్రస్తుత కేబినెట్ మొత్తాన్ని జగన్ రాజీనామా చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. అయితే ఎప్పుడనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. మరో వారంలో కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం వుంటుందని విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
మంత్రి పదవి అంటే చేదు ఎవరికి? ఇక్కడ విచిత్రం ఏమంటే… జగన్ చుట్టూ తిరగడం మానేసి, దేవుళ్ల చుట్టూ అధికార పార్టీ నేతలు ప్రదక్షిణలు చేస్తుండడం తీవ్ర చర్చకు దారి తీసింది. మంత్రి పదువులు ఎవరెవరికి ఇస్తారనే విషయం ఎక్కడా లీక్ కావడం లేదు. ఏ ఒక్కరితోనూ చర్చించకుండా పూర్తిగా జగనే మంత్రివర్గ కూర్పుపై దృష్టి సారించినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు కూడా ఇందుకు బలం చేకూర్చుతున్నాయి.
మంత్రి పదవి కోసం కలియుగ దైవం శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు తిరుమలకు క్యూ కట్టారు. ఇందులో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మిగిలిన వారితో పోల్చితే కాస్త స్పీడ్‌గా వున్నారు. ఆల్రెడీ ఇప్పుడు మంత్రులుగా ఉన్న వారు కూడా తిరుమలకు రావడం విశేషం. పదవి నిలుపుకోవాలనే తాపత్రయం వారిలో కనిపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.
నిజానికి పదవులిచ్చే అధినాయకుడిని కళ్ల ముందే పెట్టుకుని, దేవుళ్ల ఆశీస్సుల కోసం వైసీపీ ఎమ్మెల్యేలు పుణ్యక్షేత్రాలకు వెళుతుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?