ఎన్నికల హామీని జగన్ ఎట్టకేలకు నెరవేర్చారు. ఇప్పటికే ఉన్న 13 జిల్లాలకు తోడు మరో 13 కొత్త జిల్లాలు తోడు అయ్యాయి. దీంతో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఈ చరిత్రాత్మక నిర్ణయానికి వైఎస్ జగన్ నేతృత్వం వహించడం విశేషం. వర్చువల్ విధానంలో కొత్త జిల్లాలను వైఎస్ జగన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి పేరు ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ పరిపాలనా వికేంద్రీకరణకు మరో సువర్ణాధ్యాయం ప్రారంభమైందన్నారు. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ కోసమే జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించినట్టు జగన్ తెలిపారు. పలు జిల్లాలకు ముఖ్య పట్టణాలు మారాయన్నారు.
ఇవాళ్టి నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రాంభమవుతాయన్నారు. 18 లక్షల నుంచి 23 లక్షల జనాభా ఉండేలా జిల్లాల విభజన జరిగిందన్నారు. రెవెన్యూ డివిజన్లను 51 నుంచి 72కు పెంచినట్టు సీఎం జగన్ పేర్కొన్నారు. కుప్పాన్ని రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని స్థానిక ఎమ్మెల్యే, 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు కోరారని జగన్ అన్నారు.
కుప్పం ఎమ్మెల్యేతో పాటు అక్కడి స్థానిక ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసినట్టు జగన్ చెప్పారు. తన ప్రధాన ప్రత్యర్థి డిమాండ్‌ను కూడా గౌరవించి, రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశామని జగన్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు పారదర్శకంగా జరిగిందని జగన్ తన చర్యల ద్వారా చాటి చెప్పారు.