శుభమా అని ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభిస్తుంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడానికి చంద్రబాబు మనిషి బయల్దేరాడు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లా చేస్తానని వైఎస్ జగన్ ఇచ్చిన ఎన్నికల హామీని ఏపీ ప్రభుత్వం నెరవేర్చింది. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటును ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇవాళ వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే జగన్‌పై విమర్శలు చేయడానికి ఉదయాన్నే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ముందుకొచ్చారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకగా కొత్త జిల్లాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంటే, రామకృష్ణ మాత్రం విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. నూతన జిల్లాల ప్రారంభోత్సవానికి అఖిలపక్షాలను ఆహ్వానించకపోవడం దుర్మార్గమని రామకృష్ణ వాపోయారు.
జిల్లాల ఏర్పాటు అన్ని రాజకీయ పక్షాలకు ఆమోదయోగ్యమైనా ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదని ఆయన అన్నారు. నూతన జిల్లాల ఏర్పాటు కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెందిన వ్యవహారం కాదని ఆయన చెప్పుకొచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రభుత్వ అధికారులు, ప్రజలతో మమేకమై ఉంటే బావుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏకపక్ష, నిరంకుశ విధానాలను ఇకనైనా మానుకోవాలని రామకృష్ణ హితవు పలకడం విశేషం.
నూతన జిల్లాల ఏర్పాటుకు అన్ని రాజకీయ పక్షాలు ఎక్కడ మద్దతు తెలిపాయో రామకృష్ణ వివరించి వుంటే బాగుండేది. చివరికి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినా స్వాగతించడానికి టీడీపీకి మనసు రాలేదు. మిగిలిన రాజకీయ పక్షాల తరపున రామకృష్ణ వకాల్తా పుచ్చుకోవడం ఏంటో అర్థం కాదు. జగన్‌ను విమర్శించడానికి కాదేదీ అనర్హమన్నట్టు రామకృష్ణ తీరు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు వాయిస్ కాకుండా సీపీఐ తరపున రామకృష్ణ పని చేస్తే బాగుంటుందనే హితవు సొంత పార్టీ నుంచే రావడం గమనార్హం.