అమరావతికి ఎక్కడా చోటు స్థిరంగా వుండడం లేదు. చివరికి పదో తరగతి పాఠ్య పుస్తకంలో కూడా స్థానాన్ని కోల్పోయింది. దీనిపై అమరావతి పరిరక్షణ సమితి, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అమరావతిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
పదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 2వ పాఠంగా అమరావతి ఉంది. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తేవడంతో, అందుకు తగ్గట్టు విద్యార్థులకు పాఠాలు కూడా ఉండాలని భావించినట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో అమరావతి పాఠాన్ని తొలగించడం గమనార్హం.
పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి ఫ్రీ పబ్లిక్ పరీక్షలు మొదలయ్యాయి. ఈ పరీక్షలకు కొన్ని పాఠాలను మినహాయించి చదువుకోవాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సూచించారు. మినహాయింపునకు నోచుకున్న వాటిలో అమరావతి, వెన్నెల అనే పాఠాలున్నాయి.
కరోనా కారణంగా ఆలస్యంగా అకడమిక్ ఇయర్ ప్రారంభమైందని, విద్యార్థులపై భారం పడకూడదనే ఉద్దేశంతో అమరావతి పాఠాన్ని తొలగించినట్టు విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఇదే కాదని, మిగిలిన సబ్జెక్టుల్లో కూడా పాఠాలను తొలగించినట్టు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. కానీ రాజకీయ కారణాలతోనే అమరావతి పాఠాన్ని తొలగించారనేది వివిధ పక్షాల ఆరోపణ.