పవన్ కల్యాణ్ ఓదార్పు యాత్రకు రెడీ అవుతున్నారు బాగానే ఉంది. ఒక్కసారి జనంలోకి వెళ్లాక, ఎన్నికలకింకా రెండేళ్ల గ్యాపే ఉన్నాక వెనక్కి వెళ్లడం వీలవుతుందా. జనంలోకి వెళ్లాక, జనం మధ్య ఉండే కిక్కు ఏంటో తెలిసిన పవన్ కల్యాణ్ వెనకడుగు వేస్తారా..? జనసైనికుల ఒత్తిడికి తలొగ్గుతారా లేక సినిమా షూటింగ్ లపై మొగ్గు చూపుతారా..? పవన్ జనంలో ఉండటానికి డిసైడ్ అయితే పార్టీ నాయకులు, జనసైనికులు హ్యాపీ. అదే సమయంలో సినీ నిర్మాతలు మాత్రం టెన్షన్ పడక తప్పదు.
పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఫేమస్ అయితే, సినిమాల్లో కూడా ఆయనకు మరింత స్పెషాలిటీ వస్తుంది. ఇప్పటికే పవర్ స్టార్ అభిమానులు సినిమా టికెట్ రేట్లు తగ్గితే హుండీలు పెట్టి మరీ చందాలిస్తుంటారు. అప్పుడు పవన్ పేరు చెప్పి నాయకులు మరింత గొప్పగా చందాలిస్తారేమో చూడాలి. పోనీ అవన్నీ ఊహాగానాలే అనుకున్నా.. పవన్ రాజకీయాల్లో సక్సెస్ అయితే నిర్మాతలకు కూడా లాభమే. కానీ ఇప్పుడు పవన్ రాజకీయాలకే పరిమితం అంటే మాత్రం ఆయనతో సినిమాలు కమిట్ అయినవారు, సెట్స్ పై ఉన్నవారు టెన్షన్ పడక తప్పదు.
ఇవాళ్టి నుంచి హరిహర వీరమల్లు షూటింగ్ లో జాయన్ అవుతారు పవన్. భీమ్లా నాయక్ కోసం ఈ సినిమాని కాస్త లేట్ చేశారు కూడా. ఇప్పుడు రాజకీయ యాత్రలు, పరామర్శ యాత్రలంటూ పవన్ జనాల్లోకి వెళ్తే కాల్షీట్ల సమస్య తప్పదు. ఒకవేళ ఎలాగోలా కాల్షీట్లు అడ్జస్ట్ చేసినా సినిమా ప్రమోషన్లకి రావడం మాత్రం పవన్ కి కుదరదు.
పవన్ తో మరో తంటా..?
పవన్ కల్యాణ్ తో సినిమాలు తీయాలంటే కచ్చితంగా ఆయన రాజకీయ వైరి వర్గాల నుంచి వచ్చే వ్యతిరేకతను కాచుకోవాలి. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమా టైమ్ లో ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలుసు. అందులోనూ పవన్ వైరి వర్గాన్ని రెచ్చగొట్టడంలో, అందుకు సినిమాలను వాడుకోవడంలో మహా దిట్ట. ఎక్కడ నోరు జారి ఎవరిపై కామెంట్లు చేసినా, ఫైనల్ గా దాని రిజల్ట్ సినిమాపై పడుతుంది. అందుకే పవన్ తో సినిమా అంటే నిర్మాతలు ఆమేరకు రిస్క్ ని బేర్ చేయాల్సిందే.
అయితే ఈసారి పరిస్థితి మరింత భిన్నంగా మారబోతోంది. పవన్ ను హీరోగా పెట్టి అసలు సినిమాను తీయగలమా… అది ఎప్పటికి పూర్తవుతుందనే టెన్షన్ నిర్మాతలకు పట్టుకుంది. పవన్ ఇలా 2 పడవల ప్రయాణం చేస్తున్నంతకాలం నిర్మాతలకు ఈ టెన్షన్ తప్పదు.