దిగొచ్చిన ఆర్ఆర్ఆర్.. ఇకపై అందుబాటు ధరల్లో..!

ఆర్ఆర్ఆర్ దందా ముగిసింది. ఈ రోజు నుంచి ఈ సినిమా టికెట్ రేట్లు దిగొచ్చాయి. రిలీజైన రోజు నుంచి నిన్నటివరకు భారీ రేట్లతో ప్రేక్షకుల జేబుకు చిల్లు పెట్టిన ఈ సినిమా, ఇవాళ్టి నుంచి…

ఆర్ఆర్ఆర్ దందా ముగిసింది. ఈ రోజు నుంచి ఈ సినిమా టికెట్ రేట్లు దిగొచ్చాయి. రిలీజైన రోజు నుంచి నిన్నటివరకు భారీ రేట్లతో ప్రేక్షకుల జేబుకు చిల్లు పెట్టిన ఈ సినిమా, ఇవాళ్టి నుంచి సాధారణ రేట్లకే సినిమాను ప్రదర్శించనుంది. ప్రభుత్వం ఇచ్చిన 10 రోజుల వెసులబాటు నిన్నటితో ముగియడంతో, ఈరోజు నుంచి సాధారణ ధరలకే టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.

ఆర్ఆర్ఆర్ కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ధరల విషయంలో గేట్లు ఎత్తేశాయి. దీంతో విడుదల రోజు మల్టీప్లెక్సుల్లో ఒక్కో టికెట్ ధర అధికారికంగా 400 నుంచి 450 రూపాయలకు చేరుకుంది. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవే స్థాయి రేట్లు కొనసాగాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కాబట్టి “ప్రత్యేక మినహాయింపు” ఇచ్చామని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకొచ్చాయి.

ఈ వెసులుబాటుకు తోడు 5 షోలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో ఆర్ఆర్ఆర్ సినిమాకు మొదటి 3 రోజులు భారీగా వసూళ్లు వచ్చాయి. అయితే నాలుగో రోజు నుంచి ఈ సినిమాకు ఆక్యుపెన్సీ పడిపోయింది. మరీ ముఖ్యంగా భారీ రేట్లు వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఈ సినిమా చూడ్డానికి ఆసక్తి చూపించలేదు. అలా పడిపోయిన ఆక్యుపెన్సీ, ఉగాది రోజు, ఆ మరుసటి రోజు కాస్త పెరిగాయి.

ఇవాళ్టి నుంచి తెలంగాణలో ఆర్ఆర్ఆర్ సినిమాకు సింగిల్ స్క్రీన్ లో 175 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 290 రూపాయలు గరిష్ట ధర ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ స్క్రీన్స్ కు 145 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 177 రూపాయల గరిష్ట ధర అమల్లోకి వస్తుంది. రీక్లెయినర్ సీట్లు వీటికి మినహాయింపు.