జనసేనాని పవన్‌కల్యాణ్‌తో విడిపోయేందుకు బీజేపీ మానసికంగా సిద్ధమవుతున్నదా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. ఇందుకు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలే నిదర్శనమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే జనసేన, బీజేపీ పొత్తు కుదుర్చుకున్నాయి. ప్రజావ్యతిరేక విధానాలు, అలాగే ఏ ఎన్నికలైనా రానున్న రోజుల్లో కలిసే ముందుకు సాగుతామని జనసేన, బీజేపీ నాయకులు ఆర్భాటంగా ప్రకటించారు.
ప్రకటనల్లో తప్ప ప్రత్యక్షంగా జనసేన, బీజేపీ కలిసి ఉద్యమాలు సాగించిన దాఖలాలు లేవు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకుని చెప్పుకోతగ్గ స్థానాల్లో గెలుపు దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో గత నెలలో పార్టీ ఆవిర్బావ సభలో జనసేనాని పవన్‌కల్యాణ్ ఆవేశంతో ఊగిపోతూ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చీల్చనని తేల్చి చెప్పారు. అంతేకాదు, వైసీపీ ప్రభుత్వాన్ని దించేందుకు బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే, కదనరంగంలో దూకుతానని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంత వరకూ బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వలేదు.
టీడీపీతో పొత్తు కుదుర్చుకునేందుకే జనసేనాని నాటకాలు ఆడుతున్నారని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో తమను దోషిగా చూపి, చంద్రబాబుతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి పవన్‌కల్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారని బీజేపీ నేతల అభిప్రాయం. ఇదే విషయాన్ని సోము వీర్రాజు తాజాగా పరోక్షంగా తెలిపారు.
విశాఖ జిల్లా పాడేరులో బీజేపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ జనసేన పార్టీతో తమకు ఇప్పటికే పొత్తు ఉందన్నారు. ప్రస్తుతానికి ఇంకెవరితోనూ కలిసి పని చేయాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైతే ఒంటరిగానైనా పోటీ చేయడానికి సిద్ధమని ఆయన ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జనసేనాని తమతో కలిసి వచ్చే సూచనలు కనిపించకపోవడంతో బీజేపీ తమ శ్రేణుల్ని మానసికంగా ఒంటరి పోరాటానికి సమాయత్తం చేసే క్రమంలో వీర్రాజు ఈ మాటలన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం మర్యాద కోసం ఇద్దరి మధ్య పొత్తు అనే మాట తప్ప, ఆచరణలో లేకపోవడం, జనసేనాని మనసులో చంద్రబాబు ఉన్నారని తెలిసిన తర్వాత ఆయనతో కలిసి వెళ్లాలనుకోవడంలో అర్థం లేదని బీజేపీ నేతలు భావిస్తున్నారని సమాచారం.
రానున్న రోజుల్లో జనసేన మాట ప్రస్తావించకుండానే బీజేపీ తమ పని తాము చేసుకుపోతుందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.