ఏపీలో ఇవాళ్టి నుంచి మరో నూతన అధ్యాయం

ఏపీలో నేటి నుంచి కొత్త జిల్లాలు అమలులోకి వస్తున్నాయి. కొత్త జిల్లాల నుంచి పాలన మొదలవుతోంది. 13 జిల్లాలు కాస్తా 26గా మారాయి. కొత్త కలెక్టరేట్లు, కొత్త ఆఫీస్ లు, కొత్తగా పోస్టింగ్ లో…

ఏపీలో నేటి నుంచి కొత్త జిల్లాలు అమలులోకి వస్తున్నాయి. కొత్త జిల్లాల నుంచి పాలన మొదలవుతోంది. 13 జిల్లాలు కాస్తా 26గా మారాయి. కొత్త కలెక్టరేట్లు, కొత్త ఆఫీస్ లు, కొత్తగా పోస్టింగ్ లో చేరిన అధికారులు.. రాష్ట్రం మొత్తం సందడి వాతావరణం నెలకొంటోంది. పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నూతన జిల్లాల వ్యవస్థ నవ్యాంధ్ర చరిత్రలో మరో సువర్ణాధ్యాయాన్ని లిఖించబోతోంది.

మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి జగన్, కొత్త జిల్లాల్ని, జిల్లాల నుంచి పాలనను అధికారికంగా ప్రారంభించబోతున్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో కొత్త జిల్లాల్ని ప్రారంభించి, అధికారులకు దిశానిర్దేశనం చేయబోతున్నారు ముఖ్యమంత్రి.

నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత చంద్రబాబు హయాంలో కొత్తగా చెప్పుకోడానికి ఏదీ లేదు. అన్నీ తాత్కాలిక నిర్మాణాలు, తాత్కాలిక నిర్ణయాలతోనే నెట్టుకొచ్చారు. శాశ్వత ప్రాతిపదికన ఏ పనీ చేపట్టలేదు, ఆ దిశగా సాహసించలేదు. జగన్ హయాంలో పాలన మారింది. ప్రజలకు చేరువైంది. సచివాలయ వ్యవస్థతో ఓ సంచలనం సృష్టించిన సీఎం జగన్, తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుతో మరో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు. పాదయాత్రలో తాను ఇచ్చిన హామీని అమలు చేశారు. సీఎం తీసుకున్న తాజా నిర్ణయంతో, ఇప్పుడు ప్రతి ఒక్కరికి జిల్లా ప్రధాన కేంద్రం అందుబాటులోకి వచ్చింది.

అక్కడక్కడ కొన్ని అభ్యంతరాలు వచ్చినా, వాటిని పరిగణలోకి తీసుకుని, రెవెన్యూ డివిజన్లను పెంచి, నియోజకవర్గాలతో సంబంధం లేకుండా కొన్ని మండలాలను పాత జిల్లాల్లోనే ఉంచి, మరికొన్ని చోట్ల లోక్ సభ నియోజకవర్గాల పరిధిని పరిగణలోకి తీసుకోకుండా అసెంబ్లీ నియోజకవర్గాలను సైతం వేరే జిల్లాల్లో ఉంచి.. దాదాపుగా జిల్లా కేంద్రం అందరికీ అందుబాటులో ఉండేలా చూసి.. కొత్త జిల్లాల ఏర్పాటు చేపట్టారు జగన్. అధికారుల విభజన, పని విభజన, జిల్లాల విభజన.. పెద్ద బ్రహ్మపదార్ధంగా భ్రమపెట్టినా.. చివరకు అంతా సానుకూలంగా సాగింది. నేటి నుంచి అధికారిక పాలన మొదలైంది.

కొత్త జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు జగన్. అనుభవం ఉన్నవారి చేతిలో కొత్త జిల్లాలను పెడతారని అనుకున్నా.. అనుభవం కంటే ఆశావహ దృక్పథానికే పెద్దపీట వేశారు. కొత్త జిల్లాల్లో పాలనాధికారులుగా బాధ్యతలు చేపడుతున్న కలెక్టర్లు తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే అవకాశమిచ్చారు. మొత్తమ్మీద.. కొత్త జిల్లాల ఏర్పాటుతో నవ్యాంధ్ర చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలవుతోంది.