తెలుగుదేశం అంటే ఓ రాజకీయ పార్టీ కాదు, ఒక ఉద్యమం, ఒక సాంఘిక విప్లవం, ఒక నూతన ఆలోచనావిధానం, ఎన్నికల ప్రచారం నుంచి పాలనదాకా ఎల్లెడలా కొత్తదనం. రాజకీయాలకు దూరంగా వుండే మేధావులను కూడగట్టుకుని, వినూత్న విధానాలను రూపొందిస్తూ, మరో పక్క సంక్షేమం పేరుతో పేదలను ఆకట్టుకుంటూ, సమాజంలో రెండు విభిన్నవర్గాలను కలిపి ముడివేసిన ఓ ప్రయత్నం. యువతీయువకులకు, మధ్యతరగతివారికి, విద్యావంతులకు ఎన్నికలంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాదనే భరోసా, దానితో బాటు టిక్కెట్టు యిచ్చి గెలిపించుకున్న నవ్యత్వం. ఆయారామ్ గయారామ్‌లకు యిక్కడ చోటు లేదని, నిజాయితీగా ఉండదలిస్తేనే యిటు రావాలని హెచ్చరించిన తెగువ. తెలుగు జాతికి ఆత్మగౌరవం ఉందని, కేంద్ర ప్రభుత్వం సర్వాధికారాలను గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తే ఆడడానికి తోలుబొమ్మల బృందం కాదని ఎలుగెత్తి చెప్పిన పౌరుషం, తెలుగుదేశం. 40 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భవించిననాటి రూపం యిది.
తెలుగుదేశం ఇప్పటి పరిస్థితితో పోల్చి పైన రాసినదానిపై కొయ్‌కొయ్ అని మీరంటే నేనేమీ చేయలేను. ఆ మాట కొస్తే కాంగ్రెసు గురించి రాసినా అలాగే అనవచ్చు. తెలుగుదేశమే కాదు, కొన్నేళ్ల పాటు కాంగ్రెసూ గొప్ప పార్టీయే. స్వాతంత్ర్యోద్యమంలో దాని ప్రధాన పాత్ర అందరికీ తెలుసు. 1947 తర్వాత అధికారం అందుకున్నాక కూడా 10-15 ఏళ్లు బాగానే నడిచింది. తర్వాత రుగ్మత ప్రవేశించింది. పోనుపోను జబ్బుపడింది. మళ్లీ చికిత్స చేయించుకుని బాగుపడింది, మళ్లీ మంచం పట్టింది, మళ్లీ బాగుపడి, మళ్లీ చెడిపోయి, ప్రస్తుతం మరణ శయ్యాగతురాలై ఉంది. ఈ సుదీర్ఘ చరిత్రలో అది చేసిన మంచీ వుంది, చెడూ వుంది. అలాగే టిడిపి 40 ఏళ్ల చరిత్రలో కూడా వెలుగుచీకట్లున్నాయి.
70 ఏళ్లలో కాంగ్రెసు ఏం చేసింది అంటూ స్పీచులు దంచేవాళ్లు గణాంకాలు చూపించి మాట్లాడరు. 1947లో మనకున్న స్కూల్స్ ఎన్ని, ఉన్నతవిద్యాసంస్థలెన్ని, ఆసుపత్రులెన్ని, సగటు ఆయుర్దాయమెంత. జీవన ప్రమాణాలు ఎలాటివి, రోడ్లు ఎన్ని వుండేవి, విద్యుత్, సాగు నీరు, తాగు నీరు వసతులెన్ని… యిలా ప్రతీ దశాబ్దానికి లెక్కలు తీసుకుంటూ పోతే ఎవరెవరు ఏం చేశారో, ఏం చేయలేదో తెలుస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా ‘ఏదో చేశారులే, కానీ యిదే పీరియడ్‌లో చైనాలో అయితే యింకెంతో చేసేవారు…’ అని నోరు చప్పరించేవారూ ఉన్నారు. రాజకీయ వ్యవస్థ, సమాజధోరణీ భిన్నంగా వున్నపుడు అలా పోల్చలేము. స్వతంత్ర భారత దేశంలో మనం అనేక పనులు ఒకేసారి నెత్తిన పెట్టుకున్నాం. ఒక ఉదాహరణ చెప్తాను. సాగునీరు కావాలంటే భారీ ప్రాజెక్టు కట్టాలి. కానీ అది కడితే కొన్ని ఊళ్లు మునుగుతాయి, ఆదివాసీలకు నివాసం పోతుంది, అడవిలో చెట్లు పోతాయి, అరుదైన పక్షులు పోతాయి. ఇవన్నీ చూపించి ప్రాజెక్టు కట్టవద్దు అంటారు పర్యావరణ వేత్తలు. కట్టకపోతే మా బతుకెలా అంటారు రైతులు.
ఇలాటి సందర్భాల్లో మొదట అభివృద్ధి చేసేసి, ఆ తర్వాత దిద్దుబాటు చర్యలు చేయాలి అంటారు అనుభవజ్ఞులు. ఇళ్లు పోయినవాళ్లకి వేరే చోట వసతి చూపించాలి. చూపించినా తరతరాలుగా ఉన్న నివాసాలను మేం విడిచి వెళ్లం అని గిరిజనులు ఆందోళన చేస్తే..? ఏ మేధా పాట్కరో కోర్టులో కేసు వేసి స్టే తెస్తే..? చైనాలో యిలాటి బాధలు లేవు. మరి మన దగ్గర కేసులన్నీ ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్య బాపతే! గిట్టుబాటు ధర కోసం పరిశ్రమలను ఎక్కువ గంటలు పని చేయించనివ్వాలి, లేబరుకు సమ్మె హక్కూ యివ్వాలి, ప్రాజెక్టు కట్టాలి, పర్యావరణమూ కాపాడాలి, విద్యావంతులు పార్లమెంటుకి వచ్చి హుందా చర్చలు జరపాలి, నిరక్షరాస్యులకు, ఓటు విలువ తెలియనివారికి వయోజన ఓటింగు పేరుతో ఓట్లు యిచ్చేయాలి, రోడ్డు విస్తరించాలన్నా కోర్టు అనుమతి యివ్వాలి, ఉరిశిక్ష పడినవాడికి దశాబ్దాలైనా అమలు కానంత నత్తనడక నడిచే న్యాయవ్యవస్థ… ఇలా పరస్పర విరుద్ధమైనవి చెప్పుకుపోతే ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని సమన్వయ పరుచుకుంటూ పడుతూలేస్తూ ప్రభుత్వాలు పయనం సాగించాయని మనసులో పెట్టుకుంటే ఏ పార్టీ ఏ మేరకు సాధించగలిగింది అనేదానిపై ఒక సరైన అంచనా వస్తుంది.
తెలుగుదేశం పార్టీ విషయంలో కూడా అది ఎన్నో ఆదర్శాలతో ప్రారంభమైంది. కానీ అది ఆపరేట్ చేయవలసినది రాజకీయ తిమింగలాల మధ్య మసలుతూనే కదా! వీళ్ల కోసం క్లీన్ స్లేట్, ఇండిపెండెంటు స్టేట్ ఎవరూ యివ్వలేదు కదా! వీళ్లు యతి అంటే ప్రతి అనడానికి కేంద్రం సిద్ధంగా వుండేది. ప్రతీ పథకాన్నీ కోర్టుకెళ్లి ఆపించడానికి కాంగ్రెసు ఉండేది. అవినీతిరహిత పాలన అనేది ఎన్నికల నినాదమే కాదు, అక్షరాలా ఆచరించదలిచాను అని ఎన్టీయార్ చూపించబోయేసరికి ‘ఆయనకేం, కడుపు నిండిన బేరం, మన భవిష్యత్తు సంగతి మనమే చూసుకోవాలి’ అని కుమిలిన ఎమ్మెల్యేలను నాదెండ్ల తనవైపు తిప్పుకోగలిగారు. ఆ ప్రమాదాన్ని ఎలాగోలా గట్టెక్కినా, ‘విడిగా మేం గడ్డిపోచలమే కావచ్చు, కానీ కలిస్తే మదగజాన్ని బంధించగలం, అది తెలుసుకుని కొన్ని వెసులుబాట్లు యివ్వాలి’ అని ఎమ్మెల్యేలు బెదిరించే స్థితి ఎదుర్కోవలసి వచ్చింది.
వెసులుబాట్ల డోసు ఎక్కువ కావడంతో, ప్రజల ఆగ్రహాగ్నికి గురై 1989లో పార్టీ పరాజయం పాలైంది. 1983, 1985లలో 68% సీట్లు గెలుచుకున్న పార్టీ 1989లో 25% మాత్రమే తెచ్చుకుంది. సాక్షాత్తూ ఎన్టీయార్ కల్వకుర్తిలో ఓడిపోయారు. మళ్లీ 1994లో అధికారంలోకి రావడానికి కాంగ్రెసు దుష్పరిపాలన, అంతఃకలహాలు కారణాలైనా, టిడిపి కూడా ఎన్నో గిమ్మిక్కులు వేయవలసి వచ్చింది. ఆచరణకు సాధ్యం కాని ఎన్నికల వాగ్దానాలు చేయవలసి వచ్చింది. మొదట్లో పెట్టుకున్న ఆదర్శాలను నీరు కార్చవలసి వచ్చింది. ఫిరాయింపుదారులను చేర్చుకోవలసి వచ్చింది. చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్నికల వ్యూహాలు పన్నవలసి వచ్చింది. మీడియాను మేనేజ్ చేయవలసి వచ్చింది. ఎన్నికల వ్యయం తట్టుకోవడానికి మార్గాంతరాలు వెతకవలసి వచ్చింది. పేరుకి మధ్యతరగతి వారి పార్టీ, వెనుకబడిన కులాల పార్టీ అని చెప్పుకున్నా, ఆచరణలో డబ్బున్నవారి పార్టీగా, అగ్రకులస్తుల పార్టీగా రూపాంతరం చెందవలసి వచ్చింది. డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికలు గెలిచాక ఎమ్మెల్యేలు ఆవురావురుమంటూ వుండడం చూసి బాబు ‘అన్నీ ఆవిడకే పోతున్నాయి. తిరగబడకపోతే మనకు మిగిలేదేమీ ఉండదు!’ అని పురిగొల్పి పార్టీలో చీలిక తేగలిగారు.
టిడిపి శూన్యంలో ఆపరేట్ చేసి వుంటే తన ఆదర్శాలకు కట్టుబడి వుండగలిగేదేమో! కానీ అటూయిటూ వచ్చి మీద పడిపోయే వాహనాల్లా యితర శక్తులు కూడా ఆపరేట్ చేస్తూన్నపుడు సాఫీగా సాగడం కష్టం. ప్రజారాజ్యానికైనా యిది వర్తిస్తుంది. చిరంజీవి కింగ్, లేదా కింగ్‌మేకర్ అవుతారు అనుకుని పార్టీలో చేరి గెలవడానికి డబ్బు ఖర్చు పెట్టినవాళ్లు ఆయన రాజకీయంగా నస్మరంతిగా మారగానే, ‘మన పార్టీని మరో పెద్ద పార్టీలో విలీనం చేస్తారా, లేక మమ్మల్ని విడివిడిగా వెళ్లిపోమంటారా? మీకైతే యిప్పటిదాకా సంపాదించినది వుంది, మా ఫ్యూచరంతా ఎదరే వుంది’ అని చిరంజీవిని హడల గొట్టసాగారు. విధిలేక ఆయన పార్టీని విలీనం చేసి చేతులు కడుక్కున్నాడు. రేపు పవన్‌కైనా యిదే యిబ్బంది వస్తుంది. తగినన్ని సీట్లు గెలిచి అధికారంలో పాలు పంచుకోకపోతే, అనుచరగణం జారిపోతుంది. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యేతో కలిగిన అనుభవం, అప్పుడు అనేకమందితో కలుగుతుంది. చెప్పవచ్చేదేమిటంటే పార్టీ నెలకొల్పినపుడున్న ఆదర్శాలేమయ్యాయి అని మనబోటివాళ్లు వెక్కిరించడం సులభమే కానీ అనుభవించేవాడికి తెలుస్తుంది కష్టం.
పేదల కోసమే మా పార్టీ అని ప్రతివాడూ చెప్తాడు. గతంలో పేదల పార్టీ అంటే కమ్యూనిస్టులది. దానిలో ధనికులు చేరినా, గుడిసెల వాళ్లతో కలిసి మెలిసి ఉండేవారు. డబ్బున్నవాళ్లది అంటే జస్టిస్ పార్టీ, స్వతంత్ర, జనసంఘ్. కాంగ్రెసేమో మధ్యతరగతి వాళ్లది! క్రమేపీ అన్నీ మారిపోయాయి. డబ్బున్నవాళ్లు అన్ని పార్టీల్లోకి వచ్చేశారు. స్వాతంత్ర్య పోరాటసమయంలో ఆంగ్లేయులతో, సంస్థానాధీశులతో అంటకాగి లాభపడుతూ, కాంగ్రెసును యీసడించి, స్వాతంత్ర్యం వచ్చాక యితర పార్టీల్లో చేరిన ధనికవర్గం 1965 తర్వాత గ్రహించింది- కాంగ్రెసంటేనే ప్రజలకు నమ్మకం, అదే గెలుస్తోంది, మన పనులు కావాలంటే దానిలోనే చేరాలి అని.
ఎఱ్ఱ తివాచీ పరిచి కాంగ్రెసు వాళ్లకి ఆహ్వానం పలకసాగింది. ప్రజాదరణ పొందిన కాంగ్రెసు వాహనం స్టీరింగు రైటిస్టుల చేతిలోకి పోతే అనర్థం అనుకున్న లెఫ్టిస్టులు పార్టీలోకి చొరబడి స్టీరింగును తమ చేతిలోకి తీసుకోబోయారు. ఈ పెనుగులాటలో కాంగ్రెసు కాస్సేపు ఆ దారిలో పోయింది, కాస్సేపు యీ దారిలో పోయింది. 1956 నాటి ఆవడి కాంగ్రెసు తీర్మానంలోని సోషలిజం కంఠశోషలిజంగా మారిపోయింది. మధ్యమధ్యలో ఉలిక్కిపడి సోషలిజం అంటూ వచ్చారు. చివరకు మధ్యేవాద పార్టీగా తేలింది. అన్ని వర్గాలకూ మేలు చేస్తామంటూ చివరకు ఏదీ సవ్యంగా చేయని, సిద్ధాంతశూన్యమైన పార్టీగా మారింది.
టిడిపి అంటూ మొదలుపెట్టి, కాంగ్రెసు గురించి ఎందుకు రాస్తున్నావంటే పోలిక చూపి, టిడిపి కథ కూడా అదే బాణీలో నడిచిందని చెప్పడానికి! టిడిపి ప్రారంభించినపుడు, ఎన్టీయార్ ఆదర్శాలను చూసి, మురిసి రాజకీయాలతో ముఖపరిచయం లేని విద్యావంతులు, మేధావులు, మధ్యతరగతివారు రంగంలోకి వచ్చారు. డబ్బు ఖర్చు పెట్టకుండా గెలిచారు. పెద్దగా డబ్బు లేనివాళ్లు కూడా రాష్ట్రం బాగుపడితే చాలనుకుంటూ తమ ఆస్తులు అమ్మి పార్టీకి విరాళాలు యిచ్చారు. ఎన్టీయార్ మేధావులతో ఒక థింక్‌టాంక్ ఏర్పరచారు. ఏదైనా సరే కొత్తరకంగా చేయాలి, రోజుకో కొత్త పాలసీ తేవాలి, సమాజంలో సమూలంగా మార్పు తేవాలి, ఎన్టీయార్‌కి యిదే ధ్యాస. ఇదే తహతహ. ఇలా ప్రారంభమైన పార్టీ పోనుపోను రొటీన్ పార్టీగా, ఆట్టే మాట్లాడితే కాంగ్రెసుకు నకలుగా మారిపోయింది. కాంగ్రెసు వారసత్వ రాజకీయాలను తిట్టిన వీళ్లు అదే పని చేస్తున్నారు.
ఎన్టీయార్‌కు పాలనాపరమైన డొక్కశుద్ధి లేకపోయినా చిత్తశుద్ధి వుండేది. అది తేటతెల్లంగా కనబడేది. ఎన్నికల ప్రచారంలో ఖాకీ బట్టలు వేసుకున్న ఆయన సిఎం కాగానే పంచె కట్టారు, కొన్నాళ్లకు కషాయం కట్టి సన్యాసి నన్నారు. హావభావాలు విపరీతంగా కనబరుస్తూ ఉపన్యాసాలు దంచుతూ వుంటే, అధికారగణం విస్తుపోయేది, విసుక్కునేది, చిన్నచూపు చూసేది. కానీ క్రమేపీ ఆయనది నాటకీయత కాదని, హృదయం నుంచే మాట్లాడుతున్నాడని గ్రహించి అభినందించింది, అనుసరించింది. అందుకే ఆ టైములో అన్ని స్కీములు వచ్చాయి, అమలు కూడా బాగా జరిగాయి. ఎన్టీయార్‌కు తెగువ వుండేది. కాలిక్యులేషన్స్ ఉండేవి కావు. నెగ్గాక మజ్లిస్ వాళ్లు కంగ్రాట్స్ చెప్పడానికి వస్తే ‘మతకలహాలకు కారణం మీరే నంటూ’ అభినందనలు స్వీకరించలేదని పేపర్లో వచ్చింది. తర్వాత్తర్వాత బాబు హయాంలో టిడిపి మైనారిటీ ఓట్లు పోతాయి వంటి భయాలతో మజ్లిస్‌తో పొత్తు పెట్టుకుంది.
ఉద్యోగుల అలసత్వం పట్ల కఠినంగా వ్యవహరించడానికి ఎన్టీయార్ జంకలేదు. బాబు అయితే కొంతకాలం ఉద్యోగులను హడలేసి, మరికొంతకాలం నెత్తిన పెట్టుకుని కన్ఫ్యూజ్ అయిపోయారు, ఒక నిర్దిష్టవిధానానికి కట్టుబడలేదు. ద్రవిడ పార్టీలు అధికారంలోకి వచ్చిన 16 ఏళ్లకు తెలుగుదేశం ఏర్పడడంతో జాతీయ మీడియా దాన్ని చాలా అనుమానదృక్కులతో చూసింది. బెంగాల్‌లో ఆమ్రా బంగాలీలా బెంగాలీ దురభిమానం ఉంటుందని, మహారాష్ట్రలో శివసేనలా ఉద్యోగాలన్నీ మరాఠీలకే అంటుందని, యిలాటివెన్నో ఊహాగానాలు చేశారు. కేంద్రం మిథ్య అంటూ ఎన్టీయార్ ఘర్షణకు దిగితే ప్రాంతీయ పార్టీలు వస్తే కేంద్రం బలహీనపడి, దేశంలో అనైక్యత ప్రబలిపోతుందని, తను ప్రధాని కావడానికై ఎన్టీయార్ ప్రాంతీయపార్టీలను, చిన్నా చితకా ప్రతిపక్షాలను పోగుచేసి, దేశవిచ్ఛిత్తికి పాల్పడుతున్నాడని తెగ ప్రచారం చేశారు. కమ్యూనిస్టులైతే యితను మతఛాందసుడని, కాపిటలిస్టని, కార్మికద్రోహి అని నానారకాల ఆరోపణలు చేశారు.
కానీ ఎన్టీయార్‌కు సొంత నమ్మకాలు, చాదస్తాలూ ఏమున్నా ప్రజల మీద వాటిని రుద్దలేదు. మతపరంగా ఓటర్లను చీల్చలేదు. అన్ని మతాలవారికీ టిక్కెట్లిచ్చారు. తెలుగు వ్యాప్తికి శ్రమించారు తప్ప తెలుగు రానివాళ్లకు ఉద్యోగాలివ్వం అనలేదు. వివక్షత చూపలేదు. అదృష్టవశాత్తూ యిప్పటి టిడిపి, అధికారంలోకి వచ్చాక తెరాస కూడా విపరీత ప్రాంతీయవాదానికి పాల్పడలేదు. కమ్యూనిస్టుల కంటె మిన్నగా ఎన్టీయార్ పేదల సంక్షేమం గురించి ఆలోచించారు, స్త్రీలకు హక్కులు కల్పించారు. ఎన్నో అభ్యుదయపథకాలు చేపట్టారు. ఎందరు గేలి చేసినా, హక్కుల విషయంలో కేంద్రంతో పోరాటం చేయడానికి ఏ మాత్రం జంకలేదు. జాతీయ మీడియా దుష్ప్రచారానికి జంకకుండా, ఏ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ మొగ్గ తొడిగినా దానికి అండగా ఉన్నారు.
బాబుది దీనికి భిన్నమైన ధోరణి. ఎన్టీయార్ సొంతంగా పోటీ చేసి గెలుస్తూ వస్తే (1983లో పొత్తు పెట్టుకున్న సంజయ్ విచార్ మంచ్ ఓ పార్టీయే కాదు) బాబు ఎప్పుడూ చంకకర్రల మీదే ఆధారపడ్డారు. ఇన్నాళ్లకు తెగించి 2019లో ఒంటరిగా పోటీ చేస్తే పార్టీ చరిత్రలో రానన్ని తక్కువ సీట్లు వచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు సన్నిహితంగా ఉన్నారు. 2014లో సిఎం అయినప్పుడు విభజిత రాష్ట్రానికి యివ్వవలసినవి బిజెపి యివ్వకపోయినా గొడవ పెట్టుకుని ఏం సాధిస్తాం అంటూ రాజీ పడ్డారు. చివరి ఏడాదిలో పేచీ పెట్టుకుని రెంటికి చెడ్డ రేవడి అయ్యారు. సంక్షేమమా? అభివృద్ధా? అనే ద్వైదీభావంలో పడి బాబు పార్టీని బలహీనపర్చారు. ఎన్టీయార్‌కు యిలాటి శషభిషలు లేవు.
ఎన్టీయార్ సమైక్యవాది. 1969 ఉద్యమంలో తెలుగు జాతి మనది అని నినదించిన ధీరుడు. తెలంగాణలో సినిమాలు ఆడవేమోనన్న భయపడలేదు. తర్వాత కెసియార్ ఉద్యమం వచ్చేసరికి ఆయన లేడు. చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి తెలంగాణ ప్రజల మనసులో వేర్పాటు భావనలు ఉన్నాయని భ్రమపడి, కాంగ్రెసు యిస్తానంటూనే మోసం చేస్తుందని తప్పుడు లెక్కలు వేసి, వాళ్లను బెల్లించి, తెలంగాణవాళ్ల సింపతీ కొట్టేద్దామనే పెద్ద వ్యూహం వేసింది. ఏ షరతులూ పెట్టకుండా, హైదరాబాదును ఎలా పంచుకోవాలో సూచించకుండా, రాష్ట్రాన్ని విభజించమని లేఖ యిచ్చి, విభజించలేదేమని కాంగ్రెసును దబాయిస్తూ, విభజన పార్టీ ఐన తెరాసతో పొత్తు పెట్టుకుని, మళ్లీ డిసెంబరు 9 ప్రకటన రాగానే ఆంధ్ర ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి, యిలా గందరగోళ పడింది.
విభజన బిల్లు పార్లమెంటులో పాసయిన రోజున తెలంగాణ టిడిపి ఎంపీలు, ఆంధ్ర టిడిపి ఎంపీలను కొట్టారు. ఇంత హంగామా చేసినా, పుష్కరం గడిచాక చూస్తే తెలంగాణలో పార్టీయే లేదు. ఒకప్పుడు ఆంధ్రలో కంటె తెలంగాణలోనే బలంగా వుండే టిడిపి ఈనాడు ఆంధ్రలో కూడా 23 సీట్లకు, ఆట్టే మాట్లాడితే 20 సీట్లకు పడిపోయింది. ప్రాంతీయ పార్టీగా ప్రారంభమై, జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ చివరకు ఉపప్రాంతీయ పార్టీ స్థాయికి చేరింది. దీనికి బాబు నొక్కరినే నిందించి ప్రయోజనం లేదు. తక్కిన టిడిపి నాయకులు ఎందుకు ప్రతిఘటించలేదు? సమైక్యపథాన్ని విడిచిపెట్టినందుకు నిరసనగా ఎవరైనా రాజీనామా చేశారా? విభజనను యింతగా భుజాన వేసుకుంటే ఆంధ్రలో కష్టం అని ఎవరైనా పోట్లాడారా? విభజన తర్వాత ఆంధ్రలో టిడిపి గెలిచింది నిజమే కానీ దానికి మూడు కారణాలున్నాయి. అవతల ఉన్నది అనుభవశూన్యుడైన జగన్ కాబట్టి ఓటర్లు అనుభవజ్ఞుడికి ఓటేశారు. రెండోది బిజెపి, పవన్ పొత్తు. మూడోది రైతు ఋణమాఫీ హామీ. ఇంత చేసినా వైసిపి కంటె 6 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి.
కాంగ్రెసు నాయకులందరూ దిల్లీకి కట్టుబానిసలంటూ నినదించి ఏర్పడిన టిడిపి, తన పార్టీని ఎలా తయారు చేసుకుంది? అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా? అధినాయకుడు ఎంత చెప్తే అంతే కదా! పార్టీలో సంస్థాగత ఎన్నికలున్నాయా? అన్నీ నామినేటెడ్ పోస్టులే కదా! అందరూ కలిసి అధిష్టానానికి వదిలేశాం అనే ఏకగ్రీవ తీర్మానాలు చేయడమే కదా! ‘పార్టీలోకి వైసిపి ఫిరాయింపుదార్లను చేర్చుకోవద్దు అని సీనియర్‌నైన నేను చెప్పినా బాబు వినలేదు. అంతర్గత చర్చలు లేవు’ అని గోరంట్ల అన్నారు. 2014లో ఫిరాయింపులు జరిగితే 2021లో పార్టీ అన్నిరకాలుగా ఆగాధంలోకి పడ్డాక ‘నేను చెప్పలేదూ’ అన్నపుడే ఆయన నిజాయితీ తెలిసింది. అయినా ఆయనికి ఏదో చెప్పి బుజ్జగించారు. పార్టీ తీరులో ఆయన మార్పులేమైనా సూచించి వుంటే అవి అమలవుతున్న సూచనలేమీ కనబడటం లేదు. ఆ నాయకులే, ఆ ట్విట్టర్లే, ఆ నినాదాలే! గోరంట్లకు ఏం దక్కిందో ఏమో, తృప్తిపడి చుప్ అయిపోయారు.
ఇవి కాంగ్రెసు మార్కు రాజకీయాలేగా! కాంగ్రెసు పార్టీని కుక్కమూతి పిందెలు అన్నారు ఎన్టీయార్. స్వాతంత్ర్యసమరం పేరు చెప్పి ఓట్లు దండుకుంటున్న పార్టీ అన్నారు. మరి యీ రోజు టిడిపి చేస్తున్నదేమిటి? చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్లు ఎన్టీయార్ బొమ్మ చూపించి, ఆయన ఆదర్శాలు వల్లించి పార్టీకి మళ్లీ జీవం పోద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీయార్ ఆలోచనలు అమలు చేస్తున్నారా? ఆయన కెంతో యిష్టమైన మద్యనిషేధం బెల్టుషాపుల్లో మూలన పడిందిగా. మరి రెండు రూపాయల బియ్యం స్కీమేమైంది? ఆయన్ను దింపగానే మూడున్నరైంది. ఎన్టీయార్‌కు అనేక రంగాల నిపుణులతో థింక్‌టాంక్ ఉండేది. ఇప్పుడు టిడిపికి ఉందా? కర్షక పరిషత్తులున్నాయా? ఎన్టీయార్ హయాంలో ప్రభుత్వపాలన ఆయన చూసుకుంటే పార్టీ నిర్మాణం బాబు చూసుకున్నారు. ఇప్పుడు బాబు సిఎం అయ్యాక పార్టీ నిర్వహణ మరొకరికి అప్పగించారా? ఎక్కడుంది అధికార వికేంద్రీకరణ? కొడుక్కి తప్ప మరొకరికి పగ్గాలు అప్పగించే సూచనే లేదు కదా!
ఫిరాయింపుల విషయంలో ఎన్టీయార్‌ది చాలా పట్టుదల. అధికారం కోసం ఫిరాయింపులు ఒప్పుకోలేదు. ఆ నియోజకవర్గం నుంచి ఆయన కలిసి వస్తే గెలుపు ఖాయం అని చెప్పినా వినేవారు కారు. టిడిపిలోకి రావాలంటే రాజీనామా చేసి రమ్మనేవారు. మరి బాబు ఆ సంప్రదాయం పాటించారా? ఫిరాయించి వచ్చినవారికి ఏకంగా మంత్రి పదవులే యిచ్చారు. ఎన్టీయార్ అతి సామాన్యుడికి కూడా టిక్కెట్టిచ్చి నాయకుడ్ని చేశారు. ఎన్నో తరాలుగా రాజకీయాధికారం దూరంగా ఉన్న వర్గాలకు పిలిచి పెద్దపీట వేశారు. బాబు వచ్చాక ఎన్నికల ఖర్చు పెంచేసి, సామాన్యుడికి గగనకుసుమం చేశారు. పార్టీలో అప్పుడే చేరినవాళ్లకు కూడా టిక్కెట్లివ్వసాగారు. అదేమిటని అడిగినవాళ్లకు వాళ్లు ఎన్నికల ఖర్చు భరించారని, పార్టీ అధికారంలో లేనప్పుడు నిలబెట్టడానికి డబ్బులిచ్చారనీ కారణాలు చెపుతూ వచ్చారు. అన్ని పార్టీల నుంచి కూడా డబ్బున్నవాళ్లను ఆకర్షిస్తూ వచ్చారు. ఎన్టీయార్ తనను సామాన్యుడికి నేస్తంగా చూపుకుంటే, బాబు తనను కార్పోరేట్లకు, ప్రపంచబ్యాంకుకి నేస్తంగా చూపుకున్నారు. దానివలన కొన్ని వర్గాల్లో బాబు ప్రభ వెలిగింది కానీ వారి సంఖ్య తక్కువ కాబట్టి అధికాంశం ప్రజలు టిడిపిని మాటిమాటికి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు.
ఎన్టీయార్ టిడిపి హృదయానికి సంబంధించినది. బాబు టిడిపి మెదడుకు, తంత్రానికి, గణితచాణక్యానికి సంబంధించినది. మారుతున్న సమాజానికి అనుగుణంగా మారలేక కాంగ్రెసు జాతీయస్థాయిలో దెబ్బ తింది. ఆంధ్రలో టిడిపి కూడా అదే పరిస్థితిలో ఉంది. కాంగ్రెసుకు యిప్పటికీ జాతీయ స్థాయిలో 20%, కొన్ని రాష్ట్రాలలో 30%కు మించి ఓట్లు ఉన్నాయి. కానీ అధికారానికి దూరమవుతోంది. ఆంధ్రలో 30-35% ఓట్లున్న టిడిపిదీ అదే పరిస్థితి. రెండు పార్టీల అధినేతలూ హితైషుల మాట వినటం లేదు. పనికి రారని తెలిసినా తమ సంతానాన్నే వారసులుగా పుష్ చేస్తున్నారు. పార్టీలో యువరక్తం అంటే, తన పుత్రరత్నం, తన అనుయాయుల పుత్రరత్నాలు అనే భావనలో ఉన్నారు. దానితో యువత అటు మొగ్గడం మానేశారు. అన్నీ తమకే తెలుసని, ఎవరూ ఏదీ చెప్పనక్కరలేదనే అహంభావం యిద్దరికీ ఉంది.
ఈ స్థాయిలో సంప్రదాయ ఓటుబ్యాంకు ఉండి, ఉపయోగించుకోవడం రాని పార్టీతో ఎలా వేగాలో ప్రతిపక్షాలకు అర్థం కావటం లేదు. వీళ్లకు ద్వితీయస్థానం పనికి రాదు. ప్రథమస్థానాన్ని వీరికి అవతలివాళ్లు యివ్వరు. అలా అని సాంతం వదులుకోనూ లేరు. 136 ఏళ్ల కాంగ్రెసు, 40 ఏళ్ల టిడిపి యిప్పుడు ఒకే పడవలో ఉన్నాయి. ప్రతిపక్షాలకు కేంద్రబిందువుగా ఉంటానంటుంది కాంగ్రెసు. తృణమూల్ యిత్యాదులు ఒప్పుకోవటం లేదు. ఇక్కడ వైసిపి వ్యతిరేక కూటమి కట్టాలంటే టిడిపి చుట్టూనే అల్లుకోవాలి. కానీ బాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపడానికి బిజెపి, జనసేన సిద్ధంగా లేవు. పోనీ యీసారికి మీరుండండి అనే ఔదార్యం బాబు కనబర్చటం లేదు. ద్వితీయశ్రేణి నాయకత్వానికి ప్రోత్సాహం యివ్వని టిడిపికి 50 ఏళ్ల వయసు వచ్చినపుడు ఎలా వుంటుందో ఊహించుకోవడానికి కాస్త భయంగా ఉంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022)