కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో టీడీపీ ఎంపీలు విందు భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌తో మళ్లీ టీడీపీ జత కడుతుందా? అనే చర్చకు తెరలేచింది. ఢిల్లీలో శనివారం డీఎంకే కార్యాలయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తమిళనాడు సీఎం, ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కలిసి ప్రారంభించారు. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా తమిళనాడు అధికార పార్టీ విందు ఇచ్చింది.
పార్టీ కార్యాలయ ప్రారంభానికి, అనంతరం ఏర్పాటు చేసిన విందుకు టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, రవీంద్రకుమార్ హాజరు కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విందుకు బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలు అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, డీపీఐ నేత తొల్ తిరుమావళవన్, ఎండీఎంకే నేత వైగో తదితరులు హాజరయ్యారు.
పేరుకు పార్టీ కార్యాలయం ప్రారంభమనే మాటే గానీ, బీజేపీ ప్రత్యామ్నాయ కూటమి సమావేశంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ కూటమితో టీడీపీ జత కట్టడంపై రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. గతంలో మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు కాంగ్రెస్‌తో జత కట్టడాన్ని గుర్తు చేస్తున్నారు. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో యూపీఏ కూటమితో టీడీపీ జత కడుతుందా అనే చర్చకు తాజా ఢిల్లీ పరిణామాలు అవకాశం ఇస్తున్నాయి.
అయితే అన్ని రకాల సదుపాయాలతో నిర్మించిన డీఎంకే కార్యాలయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అహిత్‌షాతో పాటు ఢిల్లీలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు అందాయని, కేవలం మర్యాదపూర్వకంగానే వెళ్లినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. అంతే తప్ప, ఇందులో రాజకీయాలకు స్థానం లేదని చెబుతున్నారు.
ఈ కార్యక్రమానికి స్టాలిన్ మిత్రుడైన వైఎస్ జగన్ పార్టీ ఎంపీలెవరూ హాజరు కాకపోవడం, టీడీపీ పాల్గొనడం వల్లే చర్చకు దారి తీసింది. కానీ రాజకీయాల్లో ఏదీ కొట్టి పారేయలేని పరిస్థితి. కాంగ్రెస్‌తో రాజకీయంగా లాభం వుంటుందని భావిస్తే… మరోసారి చంద్రబాబు తప్పక జత కడతారనే చర్చ మాత్రం విస్తృతంగా సాగుతోంది.