నంద్యాల జిల్లా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నంద్యాలలో జోక్యం చేసుకోవడంతో ఆమె అన్న భూమా బ్రహ్మానందరెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అలాగే ఏవీ సుబ్బారెడ్డితో అఖిలప్రియ ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు. నారా లోకేశ్ పాదయాత్ర నంద్యాలలో అడుగు పెట్టిన వేళా విశేషమేమో తెలియదు కానీ, ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గం దాడికి పాల్పడడం ఆ పార్టీలోని కుమ్ములాటలకు నిదర్శనం.
ఏవీపై దాడి కేసులో అఖిలప్రియ వారం పాటు కర్నూలు జైల్లో గడపాల్సి వచ్చింది. ఇంతటితో వ్యవహారం ముగిసిందని అనుకుంటే పొరపాటే. అసలు కథ ఇప్పుడే మొదలైంది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు కోడలిపై అఖిలప్రియ పరువు నష్టం దావా వేయడం సంచలనం రేకెత్తిస్తోంది. బొండా పెద్ద కుమారుడు సిద్ధార్థ్‌తో ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె ఏవీ జశ్వంతిరెడ్డికి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ జంట అమెరికాలో వుంటోంది.
ఇటీవల తన తండ్రి ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ దాడి చేయించడంపై జశ్వంతి సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది. అఖిలప్రియపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారామె. ఈ నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డి, ఆయన తనయపై అఖిలప్రియ ఆళ్లగడ్డలో పరువు నష్టం దావా వేశారు. అయితే ఎంత మొత్తానికి దావా వేశారనే విషయం తెలియరాలేదు.
దీంతో ఏవీ, అఖిలప్రియ మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరినట్టైంది. ఇప్పటికే అఖిలప్రియ వ్యవహారశైలిపై బొండా ఉమామహేశ్వరరావు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అఖిలప్రియపై చర్యలు తీసుకోకపోతే నంద్యాల, ఆళ్లగడ్డలో పార్టీ మరోసారి ఓడిపోతుందని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా తన కోడలిపై అఖిలప్రియ పరువు నష్టం దావా వేయడంపై బొండా ఉమా తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏమవుతుందో చూడాలి.