తనకు పుట్టిన బిడ్డపై తొలిసారి స్పందించాడు రామ్ చరణ్. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని, తాము అనుకున్న టైమ్ కు భగవంతుడు, బిడ్డను ప్రసాదించాడని అన్నాడు. పాపకు ఆల్రెడీ ఓ పేరు అనుకున్నామని, తన పోలికలే వచ్చాయని కూడా తెలిపాడు.
“పాపకు ఓ పేరు అనుకున్నాం. నేను, ఉపాసన కలిసి నిర్ణయించిన పేరు అది. పేరు పెట్టే రోజు కోసం వెయిట్ చేయండి. ఆ రోజు వచ్చినప్పుడు అందరికీ నేనే స్వయంగా చెబుతాను. అనుకున్న టైమ్ లో సంతానాన్ని అందించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతున్నాను. పాప కచ్చితంగా నాలానే ఉంటుంది.”
కొద్దిసేపటి కిందట అపోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది ఉపాసన. భార్య, కూతురితో కలిసి తన ఇంటికి వెళ్లాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా మీడియాతో కాసేపు మాట్లాడాడు. తన పాపను దీవించిన మీడియాకు, శ్రేయోభిలాషులకు థ్యాంక్స్ చెప్పాడు.
మొదటిసారి పాపను చేతుల్లోకి తీసుకున్నప్పుడు, ప్రతి తండ్రి ఎలా ఫీలయ్యాడో తను కూడా అలానే ఫీలయ్యానని అన్నాడు చరణ్. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని చెప్పుకొచ్చాడు. ఉపాసన పూర్తి ఆరోగ్యంతో ఉందని స్పష్టం చేసిన చరణ్, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపాడు
మరికొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉండబోతున్నాడు చరణ్. పాపతో, భార్యతో కొన్ని రోజులు గడిపిన తర్వాత, తిరిగి గేమ్ ఛేంజర్ సినిమాను స్టార్ట్ చేస్తాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ నుంచి వస్తున్న సినిమా ఇదే.