ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు పిచ్చి ప్రేమ. నెల్లూరులో కార్పొరేటర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ఆయన ప్రారంభించారు. వైఎస్ జగన్ వైసీపీని స్థాపించినప్పటి నుంచి ఆయన వెంటే నడుస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఆనం బ్రదర్స్‌కు ఎదురొడ్డి జగన్‌కు అండగా నిలిచారు.
తన వెంట నమ్మకంగా నడుస్తున్న అనిల్‌కు రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. రెండో దఫా వైసీపీ అధికారంలోకి రాగానే అనిల్‌కు తన మొదటి కేబినెట్‌లో చోటు ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి పదవి నుంచి తీసేసినా అదే అభిమానంతో జగన్ వెంట ఉన్నారు. తన మిత్రుడైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీని వీడినా, అనిల్ మాత్రం జగన్‌పైనే నమ్మకాన్ని పెట్టుకున్నారు.
అయితే నెల్లూరు సిటీలో కొంత కాలంగా సొంత పార్టీ, సొంత మనుషుల నుంచే అనిల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాబాయ్ రూప్‌కుమార్ యాదవ్ రూపంలో తనకు వ్యతిరేక నాయకుడు తయార వడం అనిల్ జీర్ణించుకోలేకపోతున్నారు. అసమ్మతి రాజకీయాలకు పాల్పడుతున్న రూప్‌కుమార్‌కు వైసీపీలోని కొందరి పెద్దల అండదండలున్నాయని అనిల్ భావన. దీంతో నెల్లూరు సిటీలో పార్టీ కార్యకలాపాలకు అనిల్ దూరంగా ఉంటున్నారని, రెండు రోజుల క్రితం జగన్ నేతృత్వంలో నిర్వహించిన సమావేశానికి కూడా వెళ్లలేదనే ప్రచారం జరుగుతోంది.
అనిల్ పక్క పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. వైసీపీని వీడేందుకు అనుచరులతో అనిల్ చర్చలు జరుపుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం ఏ మేరకో అనిల్ నోరు తెరిస్తే తప్ప తెలిసే అవకాశం లేదు.
జగన్ అంటే ప్రాణమైనా ఇస్తానని, తుది శ్వాస వరకూ ఆయన వెంటే నడుస్తానని అనిల్ పలు సందర్భాల్లో చెప్పారు. ఇదే రకంగా గతంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా ఒక సందర్భంలో తాను చనిపోతే మృతదేహంపై వైసీపీ జెండా కప్పాలని భావోద్వేగంతో చెప్పారు. చివరికి ఏమైందో అందరికీ తెలుసు. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాకపోవడం వల్లే అనిల్ లాంటి జగన్ వీరాభిమానులపై వస్తున్న ప్రచారాన్ని కొట్టి పారేయలేని పరిస్థితి.