బీజేపీ Vs టీఆర్ఎస్.. నిండా మునిగింది రైతులేనా..?

కేంద్రం ధాన్యం కొంటుందని రాష్ట్ర ప్రభుత్వం, ఆ బాధ్యత రాష్ట్రానిదేనంటూ కేంద్రం.. రెండూ వాదులాడుకుంటున్నాయి. మధ్యలో తెలంగాణ రైతులే కేసీఆర్ మాట మీద ధాన్యం పండించి నిండా మునిగారు. ఇప్పుడు ఎవరు కొంటారా అని…

కేంద్రం ధాన్యం కొంటుందని రాష్ట్ర ప్రభుత్వం, ఆ బాధ్యత రాష్ట్రానిదేనంటూ కేంద్రం.. రెండూ వాదులాడుకుంటున్నాయి. మధ్యలో తెలంగాణ రైతులే కేసీఆర్ మాట మీద ధాన్యం పండించి నిండా మునిగారు. ఇప్పుడు ఎవరు కొంటారా అని ఎదురు చూస్తున్నారు.

పైచేయి కోసం తాపత్రయం..

బీజేపీని ఎలాగైనా తెలంగాణలో బద్నాం చేయాలని చూస్తున్నారు కేసీఆర్. ఆ పార్టీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలే అయినా.. కేసీఆర్ ని వారు ఇబ్బంది పెడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ని పక్కనపెట్టి మరీ బీజేపీని టార్గెట్ చేశారు కేసీఆర్. తెలంగాణలో రైతుల్ని రెచ్చగొట్టారు. ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనంటూ ఉసిగొల్పారు.

ఢిల్లీలో తేల్చుకుంటామంటూ రైతులతో ఉద్యమ కార్యాచరణ రచించారు. త్వరలోనే తెలంగాణ ఉగ్రరూపం చూస్తారంటూ హెచ్చరిస్తున్నారు కేసీఆర్. పంజాబ్ లో రెండు పంటలు కొంటారు, తెలంగాణ రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారంటూ బీజేపీపై మండిపడుతున్నారు కేసీఆర్.

మరోవైపు బీజేపీ మాత్రం ఆ బాధ్యత టీఆర్ఎస్ దేనని చెబుతోంది. ధాన్యం కొనుగోలు చేయలేకపోతే.. కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీల నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే కేసీఆర్ ఈ నాటకం ఆడుతున్నారని విమర్శించారాయన. బీజేపీ నేతలపై కేసీఆర్ కి ఉన్న కోపాన్ని రైతులపై చూపెడుతున్నారని అన్నారు ఈటల. ప్రతి గింజనూ కొంటామని గతంలో హామీ ఇచ్చిన కేసీఆర్, దాన్ని నిలబెట్టుకోవాలన్నారు.

అటు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, ఇటు బీజేపీ-అటు టీఆర్ఎస్ పార్టీల్ని కలిపి తిడుతున్నారు. బీజేపీతో కేసీఆర్ గతంలో కుమ్మక్కయ్యారని, ఉప్పుడు బియ్యం అమ్మమని కేంద్రంతో ఒప్పందం చేసుకొని సంతకం కూడా చేశారంటూ కాపీలు చూపిస్తున్నారు. బీజేపీ-టీఆర్ఎస్ గేమ్ లో రైతులు మోసపోతున్నారని ఆరోపించారు. 2021లో పారాబాయిల్డ్ రైస్ పంపమనే కేంద్రం ఒప్పందంపై టీఆర్ఎస్ ప్రభుత్వం సంతకం చేసిందని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ ఒప్పందమే తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారిందని అన్నారు.

మొత్తమ్మీద ఇటు బీజేపీ, అటు టీఆర్ఎస్.. రైతుల పేరుతో ఆధిపత్య పోరు మొదలు పెట్టాయి. రైతుల సమస్య పరిష్కారం కావడం వీరికి ఇష్టంలేదు. ఆ పేరుతో బీజేపీపై పైచేయి సాధించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారు, రైతుల ముందు టీఆర్ఎస్ పరువు తీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ధాన్యం సేకరణకు నిరాకరిస్తోంది. దీంతో తెలంగాణ రైతులు లబోదిబోమంటున్నారు. ఎరక్కపోయి కేంద్రం, రాష్ట్రం మధ్య ఇరుక్కుపోయారు.