ఉగాది మంచి మహూర్తం. మంచి పనులు చేయడానికి, కొత్త పనులు మొదలు పెట్టడానికి అంతకు మించిన మంచి మహూర్తం లేదు. అందుకే చాలామంది వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలను ఉగాది నుంచే అమలు చేస్తుంటారు. కానీ ఏపీ సీఎం జగన్ కి ఎందుకో ఉగాది కలసి రావడంలేదు. ఒకటి కాదు, రెండు మూడు ఉగాదులు ఏకంగా జగన్ కి కలసి రాకుండా వెళ్లిపోయాయి.
జగన్ పరిపాలనకు, ఉగాదికి మంచి లింక్ ఉంది. ప్రతి ఏటా ఉగాదికి ముందు ప్రభుత్వం నుంచి ఓ ఫీలర్ వస్తుంది. ఈసారి ఉగాదికి విశాఖ నుంచి పరిపాలన గ్యారెంటీ అనేది ఆ గాసిప్. అలా ఇప్పటివరకు రెండు ఉగాదులు వెళ్లిపోయాయి. తాజాగా మరో ఉగాది గడిచిపోయింది. విశాఖకు ఎప్పుడు ఆ అదృష్టం వరిస్తుందో చూడాలి.
కోర్టు వ్యవహారాలు
అసెంబ్లీలో తొలిసారిగా మూడు రాజధానులపై ప్రకటన చేసిన తర్వాత ఉగాది నుంచి పాలన మొదలు పెట్టాలనుకున్నారు. కానీ హైకోర్టు కేసుతో అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత అమరావతి ఉద్యమం, కేసు కొనసాగడంతో ప్రభుత్వం ముందడుగు వేయలేకపోయింది. అసెంబ్లీలో బిల్లు వ్యవహారం కంగాళీగా మారిన తర్వాత ప్రభుత్వం మరోసారి అలాంటి సాహసం చేయలేదు.
మౌలిక సదుపాయాలు..
ఓ దశలో విశాఖలో మౌలిక సదుపాయాల కల్పన, కార్యాలయాల తరలింపు ఊపందుకుంది. అయితే కార్యాలయాల విషయంలో కూడా హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. పోనీ న్యాయ రాజధాని విషయంలో అయినా ముందడుగు పడిందా అంటే అదీ లేదు. ఇటీవల మూడు రాజధానుల విషయంలో హైకోర్టు తీర్పు పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడంతో ఆశలు మరింతగా గల్లంతయ్యాయి.
మంత్రుల ధీమా చేతల్లో ఉందా..?
మా విధానం అభివృద్ధి వికేంద్రీకరణే, మా నినాదం మూడు రాజధానులేనంటూ మంత్రులు పదే పదే చెబుతున్నారు. మరి ఆమేరకు మూడు రాజధానుల విషయంలో ఎలాంటి నిర్ణయం మాత్రం తీసుకోలేకపోతున్నారు. అసెంబ్లీలో కొత్త బిల్లు పెడతారనుకున్నా.. కేవలం చర్చతో సరిపెట్టారు. అలా ఉగాదితో పాటు, ఓ అసెంబ్లీ సమావేశం కూడా గడిచిపోయింది.
తాజాగా హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో కూడా అంత తొందరగా అభివృద్ధి చేయలేం గడువు కావాలని కోరారు. మరి ప్రభుత్వం తన పంతం నెగ్గించుకునేది ఎప్పుడు, అసలైన ఆ ఉగాది ఎప్పుడు అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది.