ఎవరు మంత్రులు.. ఎవరు మాజీలు

దాదాపు 6 నెలల సస్పెన్స్ కు ఈ వారం తెరపడబోతోంది. ఎవరు మాజీలు అవుతారు? ఎవరు కొత్త మంత్రులుగా మారతారనే ఉత్కంఠ వీడిపోతోంది. ఈనెల 7న జరిగే కేబినెట్ భేటీలో మాజీలు ఎవరనేది క్లారిటీ…

దాదాపు 6 నెలల సస్పెన్స్ కు ఈ వారం తెరపడబోతోంది. ఎవరు మాజీలు అవుతారు? ఎవరు కొత్త మంత్రులుగా మారతారనే ఉత్కంఠ వీడిపోతోంది. ఈనెల 7న జరిగే కేబినెట్ భేటీలో మాజీలు ఎవరనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరి పదవులు పోతున్నాయో, కేబినెట్ భేటీలో జగన్ క్లియర్ గా చెప్పేయబోతున్నారు.

ఇక 8వ తేదీన గవర్నర్ తో ముఖ్యమంత్రి భేటీ ఉంది. కాబట్టి 9వ తేదీన తాజా మంత్రులు ఎవరనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఎవరి పదవి ఉంటుంది, ఎవరి పదవి పోతుందనే అంశంపై ఇప్పటికే మంత్రుల్లో ఓ స్పష్టత ఉంది. కాకపోతే 7వ తేదీన అది అధికారికం కాబోతోంది. ఈసారి మంత్రి పదవులపై రోజా లాంటి వాళ్లు చాలా ఆశలు పెట్టుకున్నారు

2019 ఎన్నికల్లో వైసీపీ విజయం తర్వాత జూన్-8న సీఎం జగన్ తోపాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ.. ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నిక కాగా వారు మంత్రి మండలి నుంచి బయటకొచ్చారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవల మరణించడంతో ఆయన స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం జగన్ మినహా 24మంది మంత్రి పదవుల్లో ఉన్నారు.

2022 ఏప్రిల్ 11తో వీరిలో కొంతమంది మాజీలవుతారు. సరిగ్గా 2 సంవత్సరాల 10నెలలపాటు వీరంతా మంత్రి పదవుల్లో ఉన్నట్టు లెక్క. ఇక కొత్త టీమ్ ఏప్రిల్ 11న బాధ్యతలు చేపడితే.. వచ్చే ఎన్నికల వరకు వారినే కొనసాగించే అవకాశముంది. ఎంతమందిని తొలగిస్తారో సరిగ్గా అంతమందినే తిరిగి పదవుల్లోకి తీసుకుంటారా.. ఆ సంఖ్య కాస్త ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా అనేది కూడా తేలాల్సి ఉంది.

ఆశావహులు వీరే..

అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి, రోజా, పిన్నెల్లి, చెవిరెడ్డి, జక్కంపూడి రాజా, కొలుసు పార్థసారధి, హఫీజ్ ఖానా, పొన్నాడ సతీష్, రజని.. ఇలా కొంతమంది మంత్రి పదవులపై గట్టిగా ఆశలు పెట్టుకున్నారు. సామాజిక సమీకరణాలు, జిల్లాల లెక్కలు.. ఇలా అన్నీ కలిపి తమకు దాదాపుగా పదవి ఖాయం అనుకుంటున్నారు. కానీ అధికారిక సమాచారం మాత్రం లేదు.

ఆశలు వదిలేసుకున్నవారు వీరే..

మంత్రి పదవి వస్తుందని అంచనా వేసుకున్నా జగన్ నుంచి అలాంటి హామీలు కానీ, కనీసం సిగ్నల్ కానీ లేకపోవడంతో కొందరు ముందే డ్రాప్ అయిపోయారు. ఆనం రామనారాయణ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న, తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు.. ఇలా కొంతమంది సీనియర్లు తమకిక ఛాన్స్ లేదని గ్రహించారు. సైలెంట్ గానే ఉన్నారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా..?

జగన్ గత కేబినెట్ లో చాలామంది అనూహ్యంగా తెరపైకి వచ్చారు. అనిల్ కుమార్ యాదవ్, మేకతోటి సుచరిత.. ఇలాంటివారంతా చివరి నిముషంలో లిస్ట్ లో వచ్చి చేరారు. ఈసారి అలాంటి వారికి అవకాశముంటుందా లేక అందరూ ఊహించిన పేర్లే ఫైనల్ లిస్ట్ లో ఉంటాయా అనేది తేలాల్సి ఉంది. 

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే మాత్రం అది కచ్చితంగా మేకపాటి కుటుంబానికే దక్కుతుందనే అంచనాలున్నాయి. ముందు మంత్రి పదవి ఇచ్చి, ఆ తర్వాత ఆ కుటుంబాన్నుంచి ఒకరిని ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిపించుకోవాలని, అప్పుడే గౌతమ్ రెడ్డికి ఘన నివాళి అర్పించినట్టవుతుందనే ఆలోచన కూడా ఉంది. ఈ లెక్కలన్నీ ఈ వారమే ఫైనల్ అవుతాయి.