ఒకటే హోం వర్క్.. 2 సినిమాలకు కలిసొచ్చింది

ప్రతి సినిమాకు హీరో కొంత హోం వర్క్ చేస్తాడు. అది మేకోవర్ అవ్వొచ్చు, బాడీ బిల్డింగ్ అవ్వొచ్చు, డైలాగ్ డెలివరీ కావొచ్చు.. కాస్త వర్క్ మాత్రం ఉంటుంది. గని సినిమాకు వరుణ్ తేజ్ కూడా…

ప్రతి సినిమాకు హీరో కొంత హోం వర్క్ చేస్తాడు. అది మేకోవర్ అవ్వొచ్చు, బాడీ బిల్డింగ్ అవ్వొచ్చు, డైలాగ్ డెలివరీ కావొచ్చు.. కాస్త వర్క్ మాత్రం ఉంటుంది. గని సినిమాకు వరుణ్ తేజ్ కూడా అలానే హోం వర్క్ చేశాడు. బాక్సర్ గా మారేందుకు గతేడాది లాక్ డౌన్ టైమ్ లో చాలా కష్టపడ్డాడు. అమెరికాలో కొన్నాళ్లు ట్రయినింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంట్లోనే మరో ట్రయినర్ సహాయంతో బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాడు.

అలా బాక్సర్ లుక్ తో పాటు.. బాక్సింగ్ లో మెళకువలు కూడా నేర్చుకున్నాడు. అలా తను పడిన కష్టం, గని సినిమాకే పరిమితం కాలేదంటున్నాడు ఈ హీరో. ఒక సినిమా కోసం పడిన కష్టం, తనకు 2 సినిమాలకు ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు.

గని కోసం చేసిన బాడీ బిల్డింగ్ మొత్తం త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ప్రవీణ్ సత్తారు సినిమాకు ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది ప్రవీణ్ సత్తారు సినిమా. ఈ సినిమా కోసం మరోసారి బాడీ బిల్డింగ్ చేసే పని తప్పిందని, గని కోసం చేసిన హోం వర్క్ అలా పనికొచ్చిందని చెప్పుకొచ్చాడు.

బాక్సింగ్ నేర్చుకోవడం వల్ల లైఫ్ లో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవాటయ్యాయని చెబుతున్నాడు వరుణ్ తేజ్. కుదిరితే ఇకపై కూడా బాక్సింగ్ ను కొనసాగిస్తానని, తన జీవితంలో ఓ భాగంగా మార్చుకుంటానని అంటున్నాడు. అలా గని సినిమా కోసం చేసిన బాక్సింగ్, వరుణ్ తేజ్ కు మరో సినిమాకు కూడా ఉపయోగపడుతోంది.