ఈమధ్య కాలంలో ఇది కామన్ అయిపోయింది. రవితేజ ఓ సినిమా చేస్తున్నాడంటే అందులో కొత్త హీరోయిన్ ఉండాల్సిందే. కాస్త పేరున్న హీరోయిన్ ఇతడి సినిమాల్లో కనిపించడం లేదు. అప్ కమింగ్ హీరోయిన్లు లేదా కొత్త ముఖాలు మాత్రమే రవితేజ సినిమాల్లో కనిపిస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది?
టాలీవుడ్ లో పూజాహెగ్డే మంచి స్వింగ్ మీదుంది. రష్మిక జోరు అందరికీ తెలిసిందే. సమంత, కీర్తిసురేష్ లాంటి హీరోయిన్లు కూడా ఉన్నారు. మరి వీళ్లలో ఎవ్వరూ రవితేజ సరసన ఎందుకు కనిపించరు? ఏరికోరి మరీ కొత్త హీరోయిన్లను, అంతగా పాపులర్ కాని హీరోయిన్లను రవితేజ ఎందుకు సెలక్ట్ చేసుకుంటున్నాడు?
ధమాకా అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. నిన్నగాకమొన్నొచ్చిన శ్రీలీల ఇందులో హీరోయిన్. రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో దివ్యాన్ష కౌషిక్ (మజిలీ) హీరోయిన్. మరో హీరోయిన్ కొత్త ముఖం. ఇక రావణాసుర సినిమా విషయానికొస్తే హీరోయిన్లది చాలా పెద్ద లిస్ట్. అను ఎమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ.. ఇదీ ఆ లిస్ట్. మరి వీళ్లలో స్టార్ హీరోయిన్ ఒక్కరైనా ఉన్నారా?
రీసెంట్ గా రిలీజైన ఖిలాడీలో కూడా ఇద్దరు హీరోయిన్లు దాదాపు కొత్త ముఖాలే. అంతెందుకు.. నిన్న గ్రాండ్ గా ప్రారంభమైన టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో కూడా క్రేజీ హీరోయిన్ లేదు. ఇద్దరు కొత్త హీరోయిన్లను తీసుకున్నారు. కాస్త పేరున్న హీరోయిన్ తో ఈమధ్య కాలంలో రవితేజ నటించిన సినిమా ఏదైనా ఉందంటే అది క్రాక్ మాత్రమే.
ఇలా కొత్త ఫేసుల వెంట పడడం వెనక ప్రధానంగా 2 కారణాలు చెబుతున్నారు టాలీవుడ్ జనాలు. వాటిలో ఒకటి ఫ్రెష్ కాంబినేషన్. రవితేజ చాలా సీనియర్ నటుడు. పైగా వయసు కూడా ఎక్కువే. కాబట్టి ఇలాంటి హీరో సరసన ఓ కొత్త ముఖాన్ని పెడితే ఫ్రెష్ ఫీల్ వస్తుందనేది మేకర్స్ అభిప్రాయమట.
ఇక రెండో కారణం ఏంటంటే.. రవితేజ ఈమధ్య తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడు. ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చే నిర్మాతకే సినిమా చేసి పెడుతున్నాడు. ఇలాంటి టైమ్ లో భారీగా డబ్బులు సమర్పించుకొని పెద్ద హీరోయిన్ ను తీసుకురావడం నిర్మాతకు మరింత భారం. అందుకే, బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకొని కొత్త హీరోయిన్లను తీసుకుంటున్నారట. రవితేజ సినిమాల్లో కొత్త హీరోయిన్ల ఎంపిక వెనక అసలు లాజిక్ అదన్నమాట.