జగన్ ప్రభుత్వాన్ని నిందించాలి. అంతకు మించి ఆయన మదిలో మరో ఉద్దేశం లేదు. జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి. అంతే తప్ప.. తాను మాట్లాడుతున్న మాటలు ప్రాక్టికల్ గా సాధ్యమయ్యేవేనా కాదా? లాంటి ఆలోచన ఆయనకు అక్కర్లేదు.
జగన్ ను తిట్టడం, తప్పుబట్టడం.. రంకెలు వేస్తూ మాట్లాడడం ద్వారా తన ఎదురుగా ఉన్న జనాలనుంచి విజిల్స్ కొట్టించుకోవడం ఒక్కటే ఆయన లక్ష్యం. అందుకే పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రలో, బహిరంగ సభల్లో తలాతోకా లేకుండా ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. తాజాగా ఆయన సీపీఎస్ రద్దు అనే తేనెతుట్టెను కదిపారు. ఒకరకంగా చెప్పాలంటే దీంతో ఆయన కొరివితో తలగోక్కున్నట్టే.
జగన్మోహన్ రెడ్డి తాను పాదయాత్ర సాగించిన రోజుల్లో.. ముందూ వెనుకా చూసుకోకుండా ప్రజల వినతులను బట్టి స్పందిస్తూ ప్రకటించిన అలవిమాలిన హామీల్లో ఓపీఎస్ ను తిరిగి పునరుద్ధరించడం ఒకటి. అధికారంలోకి వచ్చిన తర్వాత.. అందులో ఉన్న భారం ఆయనకు అర్థమైంది. అయినా సరే… ఉద్యోగులకు నష్టం జరగకుండా చూస్తానని మాట ఇచ్చారు గనుక.. సీపీఎస్ ను రద్దుచేస్తూ.. ఓపీఎస్ తో సమానమైన లాభం ఉద్యోగులకు జరిగేలాగా జీపీఎస్ తీసుకువస్తానని ఆయన ప్రకటించారు.
ఓపీఎస్ పునరుద్ధరణ అనేది ఆచరణసాధ్యం కానిది గనుక.. చంద్రబాబునాయుడు కూడా తెలివిగా దాన్ని గురించి మాట్లాడడం లేదు. మౌనంగానే ఉంటున్నారు. అయితే, ఈ మాత్రం అవగాహన లేని పవన్ కల్యాణ్ మాత్రం.. సీపీఎస్ రద్దు గురించి జగన్ ప్రభుత్వాన్ని నిందిస్తూ ప్రజల ముందు రంకెలు వేయడం విశేషం.
పవన్ ఆ తేనెతుట్టెను కదుపుతూ.. తాము అధికారంలోకి వస్తే.. సీపీఎస్ రద్దు గురించి ఉద్యోగులతో సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం అని చెప్పారు. ఈ ఒక్క మాటతోనే ఆయనలో ఉన్న అజ్ఞానం బయటపడిపోతోంది. ‘సీపీఎస్ రద్దు’ అనే పార్ట్ వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నడో ఒప్పుకుంది. కసరత్తు చేసింది. అయితే ‘ఓపీఎస్ పునరుద్ధరణ’ అనే దగ్గరే బ్రేకులు పడుతోంది, ప్రత్యామ్నాయాలు వెతుకుతోంది.
పవన్ ఇప్పుడు మధ్యలో దూరి సీపీఎస్ రద్దు గురించి ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతా అని అంటున్నారు. నిజానికి ఉద్యోగులు సంప్రదింపుల దశను ఎప్పుడో దాటిపోయారు. కేవలం.. ఓపీఎస్ పునరుద్ధరణ తప్ప మరో ప్రతిపాదనకు వారు నో చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ కు ధైర్యం ఉంటే తమ ప్రభుత్వం రాగానే ఎన్నిరోజుల్లో ఓపీఎస్ తిరిగి తీసుకువస్తారో చెప్పాలి. ఆ మాట చెప్పగల తెగువ ఆయనకు లేదు. చంద్రబాబును సంప్రదించి గానీ చెప్పలేని దైన్యస్థితి ఆయనది. అవగాహనలేని మాటలతో ఇంకా, సీపీఎస్ రద్దుకోసం సంప్రదింపులు చేస్తా అంటున్నారు. మొత్తానికి పవన్ ఈ అంశం తెరపైకి తేవడం ద్వారా తేనెతుట్టెను కదిపినట్లయిందని పలువురు భావిస్తున్నారు.