ఉగాది రోజున మాన్యులకూ, సామాన్యులకూ పంచాంగ శ్రవణం ఆసక్తిదాయకమైన అంశం. పల్లెటూళ్లలో కూడా ఈ రోజున పంచాంగ శ్రవణాలు జరిగేవి.
ఇప్పుడంటే టీవీలూ, యూట్యూబుల్లో పంచాంగ శ్రవణాలను జనాలు ఫాలో అవుతున్నారు కానీ, కొన్నేళ్ల కిందటి వరకూ కూడా ఏ ఊరికా ఊర్లో దేవాలయాల్లో పండితులు పంచాంగశ్రవణం చేసే వారు.
వ్యక్తులు వారి పేర్లకు ఈ యేడు ఎలా ఉంటుందో అడిగి తెలుసుకునే వారు. అలాగే ఏ పంటకు సానుకూల స్థితి ఉంటుంది, ఏ ధాన్యం బాగా పండుతుందనే విషయాలను కూడా పంచాంగ శ్రవణంలో అడిగి తెలుసుకునే వారు.
ఇక పొలిటికల్ పంచాంగ శ్రవణాలు కూడా తెలుగునాట ఆది నుంచి ఆసక్తిని రేపేవే. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ఉగాది జరుగుతుంది. అక్కడ రాష్ట్రానికి, ముఖ్యమంత్రి జాతక రీత్యా వారికి ఎలా ఉండబోతోందో పండితులు చెబుతారు.
ఇక పార్టీలు కూడా తమ తమ కార్యాలయాల్లో ఉగాది వేడుకలను జరుపుకుంటూ.. అక్కడా తమ పార్టీకి ఈ ఏడాది అద్భుతంగా ఉండబోతోందని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది.
మరి శుభకృత్ ఉగాది సందర్భంగా ఒక జ్యోతీష్య పండితుడు పొలిటికల్ పంచాంగాన్ని ప్రస్తావించారు. మాండ్రు నారాయణ రమణావు సిద్ధాంతి.. ఈ ఏడాది రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ… సీఎం జగన్ మోహన్ రెడ్డికి గ్రహ అనుకూల స్థితి ఉందన్నారు. మే నెల నుంచి మరింత సానుకూల పరిస్థితి జగన్ కు ఉండబోతోందన్నారు.
ఈ ఏడాదిలో ఎన్నికలు వచ్చినా.. జగన్ కు తిరుగులేదని, 120 కు పైగా సీట్లతోనే ఆయన పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ పంచాంగ కర్త చెప్పారు. ఏపీ సెక్రటేరియెట్ లో వాస్తుదోషం ఉందని, అలాగే అసెంబ్లీ నిర్మాణంలో కూడా స్వల్ప మార్పు అవసరమన్నారు. వీటిల్లో మార్పు చేస్తే ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు మరింత సానుకూల ఏర్పడుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ గ్రహానుకూల స్థితి మాత్రం దివ్యంగా ఉందని ఆయన వివరించారు.
ఇక చంద్రబాబుకు గ్రహానుకూల స్థితి లేదని ఈ పండితుడు చెప్పడం గమనార్హం. అంతే కాదు.. గ్రహబలం ఉన్నవారు ఎవరైనా చంద్రబాబుతో జత కడితే, వారు కూడా రాజకీయంగా నీరసపడిపోతారని ఆయన అన్నారు.