టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి సొంత జిల్లాపై రాజకీయంగా పట్టులేదు. ఇక ఆయన కుమారుడు లోకేశ్‌కు సొంత జిల్లాపై పట్టు సరేసరి. రాయలసీమలోని చిత్తూరు చంద్రబాబు సొంత జిల్లా. జిల్లాల పునర్వ్యస్థీకరణలో భాగంగా తిరుపతి జిల్లాలోకి చంద్రబాబు స్వస్థలం చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లె చేరింది. దీంతో ఇకపై చంద్రబాబు చిత్తూరు బదులు తిరుపతి జిల్లా వాసి అవుతారు.
చంద్రబాబునాయుడు మొదటిసారి తన రాజకీయ ప్రస్థానాన్ని చంద్రగిరి నుంచి మొదలు పెట్టారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున గెలుపొంది… అంచెలంచెలుగా ఎదిగారు. 1983లో ఎన్టీఆర్ హవాలో చంద్రగిరి నుంచి చంద్రబాబు ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కుప్పానికి మకాం మార్చారు. ప్రస్తుతం అక్కడి నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
సుదీర్ఘ కాలం పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసినప్పటికీ సొంత జిల్లాపై పట్టు సాధించలేకపోయారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సొంత జిల్లాపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. 2019లో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన పులివర్తి నానితో లోకేశ్ సమావేశమయ్యారు.
చిత్తూరు పార్లమెంట్‌తో పాటు చంద్రగిరిలో టీడీపీని గెలిపించే బాధ్యతను నాని భుజాలపై పెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. చిత్తూరు, చంద్రగిరిలలో పార్టీని గెలిపించడం చంద్రబాబుకే చేతకానప్పడు, నాని మాత్రం ఏం చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ప్రతిపక్ష స్థానంలో ఉన్న లోకేశ్ పార్టీని బలోపేతం చేసేందుకు ఎందుకు ప్రయత్నించలేదనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. సోషల్ మీడియాకు పరిమితం కాకుండా, చిత్తూరు జిల్లాలో పర్యటించి పార్టీని బలోపేతం చేసేందుకు లోకేశ్ ఎందుకు ముందుకు రావడం లేదనేది టీడీపీ శ్రేణుల ప్రశ్న.
కేవలం జగన్‌పై వ్యతిరేకతే పార్టీని గెలిపిస్తుందనే భ్రమల నుంచి ఎంత త్వరగా బయట పడితే, అంత మంచిదని చెప్పేవాళ్లు లేకపోలేదు.