అరవై తెలుగు సంవత్సరాల పేర్లను.. పంచాంగ కర్తలు ఎన్నో అధ్యయాలు, అనుభవాల ఆధారంగానే పెట్టి ఉండవచ్చు.
ఇలాంటి క్రమంలో నేటితో శుభకృత్ నామ తెలుగు సంవత్సరం ప్రారంభం అయ్యింది. పేరులోనే శుభాన్ని ఆకాంక్షిస్తున్నట్టుగా ఉంది ఈ సంవత్సర నామం.
గత రెండు మూడేళ్ల తెలుగు సంవత్సర నామాలను పరిశీలించినా.. నామఫలాల ఆధారంగానే అంతా జరిగిందని అనలేం కానీ, రెండేళ్ల నుంచి ప్రపంచంలోని మానవాళి అంతా కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడింది.
కొన్ని లక్షల మంది ప్రాణాలను తీసింది కరోనా వైరస్. అనేక కుటుంబాలను ఇబ్బంది పెట్టింది. మరెంతో మంది ఉపాధిమార్గాలను దెబ్బతీసింది.
కాలప్రవాహంలో అలాంటి ఎగుడుదిగుడులు ఉండవచ్చని అనుకున్నా.. కరోనా అనుభవం మాత్రం అత్యంత దుర్భరమైనదే.
అలాంటి సంవత్సరాలు రెండు గడిచిన తర్వాత కరోనా నుంచి ప్రపంచానికి, భారతదేశానికి, తెలుగువారికి కాస్త ఉపశమనం లభిస్తున్న వేళ శుభకృత్ నామ సంవత్సరం ప్రారంభం అయ్యింది.
రోజువారీ కరోనా కేసులు జీరో స్థాయికి వెళ్తున్నాయన్న వార్తలు వస్తున్న వేళ శుభకృత్ నామ సంవత్సరం ప్రారంభం అయ్యింది. నిత్యజీవితంలో తీపి, చేదు, వగరుల కలయిక ఉన్నా.. శుభకృత్ నామ సంవత్సరంతో రెండేళ్ల చేదు అనుభవాలు మాత్రం తిరగబెట్టక, సమసిపోతాయని ఆశిద్దాం.
మనిషికి ముఖ్యమైనది ఆత్మవిశ్వాసం అని, సత్సంకల్పాలతో..ఆత్మవిశ్వాసంతో అడుగుముందుకు వేస్తే.. ఆటుపోట్లు ఎదురైనా.. అన్ని కాలాలూ సానుకూలంగా ఉంటాయనేది మాత్రం సత్యం!