ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయం ఉంది. అధికారంలో ఉండి.. 151 మంది ఎమ్మెల్యేల సొంతబలం ఉండి, సంక్షేమ పథకాలతో ప్రజలంతా తనవైపే ఉన్నారన్న సమాచారం ఉండి కూడా.. జగన్ ఎన్నికల విషయంలో ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలను ఇప్పటినుంచే జనంలోకి వెళ్లాలని ఆదేశించారు.
చంద్రబాబు కూడా తనపని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. బీజేపీకి అది అలవాటు లేదు కాబట్టి పర్లేదు. మరి జనసేన పరిస్థితి ఏంటి..? పవన్ ఇంకా సినిమాలు, రాజకీయాలంటూ రెండు పడవలపై కాలు పెడితే ఎలా? రెండేళ్లలో వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారు..?
తేల్చుకునే సమయం ఇదే..?
సినిమాలు చేస్తే పవన్ కల్యాణ్ కి డబ్బులొస్తాయి, ఆ డబ్బుల్ని రాజకీయాల కోసం ఖర్చుపెడతారనేది అందరూ చెబుతున్న మాట. మరి రాజకీయాల్లో ఖర్చు పెట్టే డబ్బు బూడిదలో పోసిన పన్నీరు కాకూడదు కదా. అలా కాకూడదంటే ఆయన రాజకీయాలకు కూడా సమయం కేటాయించాలి. పదే పదే జనసైనికులు సీఎం సీఎం అంటే అయిపోరు కదా. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచైనా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా.
సినిమాల్లో పవన్ కల్యాణ్ పవర్ స్టారే. కానీ ఇక్కడ పొలిటికల్ పవర్ స్టార్ జగన్ ని ఎదుర్కోవాలంటే పవన్ మరింత కసరత్తులు చేయాల్సి ఉంటుంది. అవేవీ లేకుండా నేరుగా బరిలో దిగి, నేనోడిపోయా, జనం నన్ను గుర్తించట్లేదు, జనం నన్ను ఓడించారు, అయినా జనం కోసం పాతికేళ్లు పోరాటం చేస్తానంటే ఎలా..?
బరిలో దిగితే తాడో పేడో తేల్చుకోవాలి. పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్నారు సరే, కనీసం పార్టీ పెట్టి ఇన్నేళ్లవుతున్నా పార్టీ అధ్యక్షుడిగా పవన్ కి చట్ట సభల్లో ఎంట్రీ దక్కలేదు. ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎన్నికైనా ఆయన్ను కూడా కాపాడుకునే లౌక్యం పవన్ దగ్గర లేదు. మరి రాజకీయాలు ఎలా చేస్తారు, పాతికేళ్లలో ఏం సాధిస్తారు.
జనసైనికుల్లో నిరుత్సాహం..
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేది లేదంటూ ఇప్పటికే ఓ భారీ స్టేట్ మెంట్ ఇచ్చి టీడీపీ చేతిలో చిలకలా మారిపోయారు పవన్, మరోవైపు బీజేపీతో పొత్తు కూడా ఉంది. ఈ దశలో అసలు జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే క్లారిటీ లేదు. నాయకులు అయోమయంలో ఉన్నారు. పోరాటాల సమయంలో కూడా జనసేనాని జనంలోకి రాకపోయేసరికి క్యాడర్ లో కూడా అసంతృప్తి ఉంది. వీటన్నిటినీ అధిగమించి రెండేళ్లలో పవన్ అనుకున్నది సాధించగలరా అంటే అనుమానమే.
పాతికేళ్ల ప్రజా ప్రస్థానం నిజమే అయితే పవన్ ఇప్పటికైనా జనంలోకి రావాలి. సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇవ్వాలి. ప్రెస్ నోట్లు, వీడియోలు రిలీజ్ చేసి పోరాటం చేస్తామంటే కుదరదు. రంగంలోకి దూకాల్సిందే. జనసైనికులు కోరుకుంటోంది ఇదే.